ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చారంటే అది కార్యరూపం దాలుస్తుందా… కార్యరూపం దాలిస్తే ఎంత కాలానికి అనేవి బేతాళ ప్రశ్నలు లాంటివి. తాజాగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇంత వరకూ అమలు కావడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు సంబంధించిన లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎవ్వరి సిఫారసు లేఖలు తిరుపతిలో చెల్లుబాటు అయ్యేవి కావు. గత టర్మ్‌లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సయోధ్య బాగా ఉన్న పరిస్ధితుల్లో కూడా ఒకరిద్దరు ముఖ్య నాయకుల లెటర్లు మాత్రమే తిరుమలలో చెల్లుబాటు అయ్యేవి. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్‌కు 2024లో చంద్రబాబునాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో అప్పటికే చంద్రబాబు ప్రియ సహచరుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ్యుల లేఖలు తిరుమల దర్శనాలకు చెల్లుబాటు అయ్యేలా చూడాలని డిమాండ్ మొదలయ్యింది. ఇందులో ఒకరిద్దరు శాసనసభ్యులు ఒకడుగు ముందుకు వేసి తిరుమలలో స్వామివారిని దర్శించకున్న అనంతరం కొండపై నుంచే ఈ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు కూడా తిరుమల దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అంగీకరించేలా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు వారానికి నాలుగు లేఖలు టీటీడీకి సిఫారసు చేయవచ్చని ప్రకటించారు. ఇందులో వారానికి రెండు లేఖలు బ్రేక్ దర్శనానికి మరో రెండు లేఖలు 300 రూపాయల టిక్కెట్ దర్శనాలకి సిఫార్సు లేఖలు టీటీడీకి పంపితే అంగీకరిస్తారని చంద్రబాబు ఒప్పుకున్నారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీయం చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఇకపై తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అంగీకరిస్తామని, వారానికి నాలుగు సిఫారసు లేఖలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల దర్శనాల విషయంలో తమ లేఖలు చెల్లుబాటు అయ్యేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ ఉబ్బితబ్బుబ్బైపోయారు. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
అయితే మాట ఇచ్చింది చంద్రబాబు… ఆయనిచ్చిన మాట అంత తర్వగా అమలులోకి వస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు. ప్రస్తుతం తాజా పరిస్ధితి ఏంటంటే తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫారసు చేసిన లేఖలు వేటినీ టీటీడీ అంగీకరించడం లేదు. దీంతో ఎంతో ఆశతో తమ ప్రజాప్రతినిధుల సుఫారసు లేఖలతో తిరుమలకు వెళుతున్న తెలంగాణీయులకు అక్కడ నిరాశే ఎదురవుతోంది. చంద్రబాబు చెప్పిన తరువాత కూడా టీటీడీ లేఖలు తమ లేఖలు ఎందుకు అంగీకరించడం లేదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఆరా తీయగా తమకు ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని జేఈఓ కార్యాలయ వర్గాలు చెప్పడంతో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవాక్కయ్యారు. గతంలోలాగే ఇప్పుడు కూడా తెలంగాణకు చెందిన కొంతమంది ముఖ్య నేతల లేఖలను మాత్రమే టీటీడీ అధికారులు యాక్సప్ట్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల లేఖలతో పాటు ప్రభుత్వంలో ఇద్దరు ముగ్గురు కీలక మంత్రుల లేఖలను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటోంది. ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు సిఫారసు లేఖ పంపినా వాటిని తిరస్కరిస్తున్నారు టీటీడీ సిబ్బంది. దీంతో తమ లేఖలు టీటీడీలో చెల్లుబాటు అవుతాయని స్వామివారి దర్శనం కోసం తాము పంపుతున్న సిఫారసు లేఖలు అక్కడ చెల్లుబాటు కాకపోవడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు ఇచ్చిన వారికి సమాధానాలు చెప్పుకోలేకపోతున్నారు. ఎన్నికల హామీలలాగే తిరుమల దర్శనాల విషయంలో కూడా తెలంగాణకు ఇచ్చిన మాటను చంద్రబాబు విస్మరించారా అని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.