కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడేందుకు మరో కీలక ముందడుగు పడింది. టటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిప్పటినుంచీ బీఆర్ నాయుడు తిరుమల క్షేత్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఇప్పటికే తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగులను పలువురిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజాగా ఆలయ పవిత్రతను కాపాడేందుకు తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల క్షేత్రం మీదుగా ఎలాంటి విమానాలు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. కానీ, విమానాలు ఆలయం మీదుగా చక్కర్లు కొట్టిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తిరుమలకు సమీపంలో రేణిగుంట విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు అభిప్రాయ పడే పరిస్థితి. కానీ, ఆలయ పవిత్రతను కాపాడేందుకు తిరుమల కొండను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది.
ఆలయం మీదుగా విమానం ఎగరడం అపచారంగా భక్తులు భావిస్తారు. అందుకే, తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు, భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఆ లేఖలో టీటీడీ చైర్మన్ కోరారు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, ముఖ్యంగా హెలికాప్టర్లు ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో ఫ్లయింగ్ జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని లేఖలో చైర్మన్ పేర్కొన్నారు.
అటు.. టీటీడీ చైర్మన్ లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తిరుమలను నో ఫ్లై ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటిస్తే ఎప్పటినుండో భక్తులు కోరుతున్న డిమాండ్ నెరవేరినట్లని చెప్పవచ్చు.