కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప‍్పటి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా సోషల్ మీడియాలో ప్రాభవం పెంచుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. దీంతో ఆయన బీజేపీలో చేరాడు. తర్వాత బయటకు వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్లను కాదని తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చి గెలిపించింది. కానీ, ఇప్పుడు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు చింతపండు నవీన్.
సర్వే నివేదిక తగులబెట్టిన సొంతపార్టీ ఎమ్మెల్సీ :
రెండు రోజుల క్రితం వరంగల్‌లో నిర్వహించిన బీసీల సభకు హాజరై రెడ్డి సమాజికవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశాడు తీన్మార్ మల్లన్న. ఇక, తాజాగా కుల గణన నివేదికను తప్పు పట్టాడు. లైవ్‌లోనే కులగణన పత్రాలను తగులబెట్టాడు. అంతే కాకుండా బీసీ కులగణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగల పెట్టాలంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఇది రెడ్లు ఆడుతున్న డ్రామా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో కుల గణనపై ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న మాత్రం సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడటం కలకలం రేపుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…తాజాగా కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఓ యూట్యూబ్ చానెల్‌లో లైవ్‌లో కుల గణన నివేదికపై మాట్లాడని మల‍్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుల గణన పూర్తిగా బోగస్ అని మండిపడ్డాడు. అది జానారెడ్డి సర్వే అని హాట్ కామెంట్స్ చేశాడు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వే వంద శాతం కరెక్ట్ అని కితాబిచ్చాడు. కాంగ్రెస్ కులగణన రిపోర్టును ఉచ్చపోసి తగలబెట్టాలని దారుణంగా వ్యాఖ్యానించాడు. ఉచ్చపోస్తే కాలదు కాబట్టి వట్టిగా తగలబెడుతున్నానని లైవ్‌లోనే కాల్చాడు.
నోరు జారిన చింతపండు నవీన్ :
జర్నలిస్టుగా.. యూ ట్యూబ్ ఛానల్ ఓనర్ గా తీన్మార్ మల్లన్న తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనంగా మారాడు. స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి.. నాటి అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో చేరాడు. కొంతకాలానికి అందులో నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్‌పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించలేదు. తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో తన వాయిస్ మాత్రమే వినిపించాడు. అవసరమైతే అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా వెనుకాడడం లేదు. ఆమధ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో.. సొంత పార్టీ నాయకులే తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోలేదు. పైగా ఇటీవల నిర్వహించిన బీసీ సభలో ప్రభుత్వంపై బహిరంగసభలోనే తీవ్ర విమర్శలు చేశాడు. ఓ సామాజిక వర్గంపై కూడా తీవ్రంగా మండిపడ్డాడు. ప్రస్తుతం కొనసాగుతున్న రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పాడు. 2028లో కచ్చితంగా బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని.. తీన్మార్ మల్లన్న స్పష్టం చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవాడు.
సోమవారం ఓమాట.. మంగళవారం మరోమాట :
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేను మల్లన్న విమర్శించాడు. ఆ సర్వే జరిగిన తీరు సహేతుకంగా లేదని మండిపడ్డాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజుల్లో సమగ్ర సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో తెలియదు కానీ.. ఆ సర్వేను నూటికి నూరు శాతం కరెక్ట్ అని తీన్మార్ మల్లన్న తాజాగా వ్యాఖ్యానించాడు. అయితే మంగళవారం నాటి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నాటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వేలో పందుల లెక్క ఎంత ఉందో చెప్పారు గానీ.. బీసీల లెక్క ఎంత ఉందో చెప్పలేదని నాలుక మడత పెట్టారు. కేవలం రోజు వ్యవధిలోనే మల్లన్న మాట మార్చడంతో సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మల్లన్న తీరుపై మండిపడుతున్నారు. సోమవారం ఒక మాట.. మంగళవారం మరొక మాట.. ఇలా నాలుక మడత ఎందుకు పెడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి మాటమీద నిలబడే సత్తా ఉండాలని.. కానీ, తీన్మార్ మల్లన్న విద్యాధికుడైనప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదని దుయపడుతున్నారు.
కాంగ్రెస్‌కు కంటగింపుగా తీన్మార్ మల్లన్న :
ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడని.. సోషల్ మీడియాలో నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాడని.. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి కంటగింపుగా మారాడని.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు తీన్మార్ మల్లన్న బీసీ సభ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. అయితే అవి పాత ఫోటోలు అని తీన్మార్ మల్లన్న టీం కౌంటర్ ఇస్తోంది.. మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఆరోపణలు ప్రతీ ఆరోపణలతో సోషల్ మీడియా రచ్చ రచ్చ అవుతోంది.
షోకాజ్ నోటీసులు.. వేటు తప్పదా? :
మరోవైపు.. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ లైన్ క్రాస్ చేసి.. కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. అలాఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తీన్మార్ మల్లన్న వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా సొంత పార్టీపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో సంచలన కామెంట్స్ చేసారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగే సూచనలు లేవని.. సర్వే నివేదిక పత్రులను తగులబెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉపక్రమించింది.