22న స్విచ్ నొక్కనున్న ప్రధాని నరేంద్ర మోదీ
బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ప్రారంభం
మరో 12 స్టేషన్లలో శరవేగంగా ఆధునీకరణ పనులు
అత్యద్భుతంగా మారిపోతున్న రైల్వేస్టేషన్లు
తెలంగాణ లోని మూడు రైల్వే స్టేషన్లు పాత రూపు రేఖలు మారిపోయాయి. సరికొత్త రూపు సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేటతో పాటు.. ఉత్తర తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీన ప్రారంభించనున్నాయి. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీట నొక్కి ఈ స్టేషన్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ స్టేషన్లలో నిర్మాణాలు పూర్తయ్యాక కొత్త ఫోటోలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) నిధుల ద్వారా చేపట్టిన పనులతో ఈ స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. స్టేషన్ల బయట, లోపల కూడా ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో దాదాపు రూ.26.64 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ స్టేషన్‌ను పూర్తిగా పునర్నిర్మించారు. ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కే శ్రమను తగ్గించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంతాలు విశాలంగా నిర్మించారు. పరిశుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు, ఆధునిక మరుగుదొడ్లు, మెరుగైన లైటింగ్, టికెట్ కౌంటర్లు, లాకర్ గదులు, తాగునీటి సౌకర్యం, ఏటీఎంలు, డిజిటల్ డిస్‌ప్లేలు, సీసీటీవీ కెమెరాలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
ఇటు.. వరంగల్ రైల్వేస్టేషన్, హైదరాబాద్‌లోని బేగంగపేట రైల్వేస్టేషన్ కూడా ఎయిర్‌పోర్టులను తలపిస్తున్నాయి. ప్రయాణీకులు ప్రవేశించే మార్గాలు, లిఫ్టుల ప్రాంతాలు ఇంతకుముందు ఇరుగ్గా ఉండేవి. ఇప్పుడు విశాలంగా పునర్నిర్మించారు. ఇక, ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి రూపొందించిన గదులు ఎయిర్‌పోర్టుల్లో లాంజ్‌లను తలపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను ఆధునీకరించడం వంటి పనులు చేపడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఉచిత వై-ఫై సదుపాయం కల్పించడం. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం, స్టేషన్లలో ప్రయాణికుల సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూలమైన పద్ధతులను అవలంబించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో భాగంగా పునర్నిర్మిస్తున్నారు. తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా.. సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం, నల్గొండ, మిర్యాలగూడ, జనగాం, భువనగిరి, మధిర, యాదాద్రి వంటి స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1309 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.