కామారెడ్డి జిల్లాలో ఒకే సారి ముగ్గురు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. జిల్లాలోని సదాశివనగర్ మండలం అడ్లూర్ లోఉన్న ఎల్లారెడ్డి పెద్ద చెరువులోకి దూకి ఒక ఎస్సై, ఒక మహిళా కానిస్టేబుల్ ఒక కంపూటర్ ఆపరేటర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత చెరువు గట్టుపై కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతిల మొబైల్ ఫోన్లు లభ్యమవ్వడంతో గజ ఈతగాళ్ళను తెప్పించి వారిద్దరి శవాలను వెలికి తీయించారు. అయితే అదే చెరువు గట్టుపై ఎస్సై సాయి కుమార్ వ్యక్తిగత వాహనం, పాదరక్షకులు కనిపించడంతో కొద్ది సేపటికి ఎస్సై మృత దేహాన్ని కూడా గజ ఈతగాళ్ళు వెలికి తీసారు. సాయికుమార్ బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతిలు బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. వీరంతా బుధవారం జాతీయ రహదారి పక్కనే ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్సై కారు లభ్యం కావడంతో పోలీసులు గజ ఈతగాళ్ళను రప్పించి చెరువలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు అఖిల్, శృతిల మృత దేహాలు లభ్యం కాగా గురువారం ఉదయం ఎస్సై సాయికుమార్ మృత దేహాం దొరికింది. అయితే వీరి ముగ్గరి మధ్య ఉన్న సంబంధం ఏం..? వీరు ముగ్గురూ ఇలా సామూహికంగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.