విశాఖపట్నం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీన అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను సమర్పించింది. భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం భారీగా తరలిరావడంతో, వర్షం కారణంగా ఆలయంలో హడావిడి మధ్య నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ నేతృత్వంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఐజీ ఆకే రవికృష్ణలతో కూడిన కమిటీని నియమించింది. కమిటీ తన పరిశీలనలో చందనోత్సవానికి ముందు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా లేనిది అయినా ఆలయ అధికారులు రెండు అడుగుల వెడల్పుతో, పైల్ ఫౌండేషన్ లేకుండా, 70 అడుగుల పొడవు గల గోడను హడావిడిగా నిర్మించారని గుర్తించింది. వర్షం వల్ల నీరు, బురద భారీగా చేరి గోడపై బరువు పెరిగి కూలిపోయిందని, అంతేగాక నీటి ప్రవాహానికి అవసరమైన లీప్ హోల్స్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. ప్రాథమికంగా అంగీకారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా అనుమతులు ఇచ్చి నిర్మాణాన్ని ప్రారంభించారని నివేదికలో పేర్కొన్నారు. గోడ నిర్మాణానికి డిజైన్లు లేవు, పునాదుల్లేవు, భద్రతా తనిఖీలు జరపలేదని, భక్తుల భద్రతను నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించింది. దీనిపై ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఏడుగురు సస్పెన్షన్ :
ఓవైపు.. విచారణ కమిటీ నివేదిక సమర్పించడంలో మరోవైపు.. అధికారులపై చర్యలు తీసుకోవడం కూడా మొదలయ్యింది. సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలో ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంది. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్‌ను బ్లీక్ లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సింహాచలం ఆలయ ఈవో కే.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ కే.ఎస్.మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్, సింహాచలం ఆలయ జేఈ కే.బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది.