37.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

కుంభమేళాకు మూడు తలల ఏనుగు వచ్చిందా? -భాస్కర నిజ నిర్ధారణ

ఈనెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళా కొనసాగుతుంది. ప్రతి పుష్కరానికోసారి, అంటే.. పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే ఈ ఉత్సవాల కోసం.. మూడు పవిత్ర నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కుంభమేళా కోసం సర్వాంగ సుందరంగా రెడీ అవుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. అయితే, ఇదేసమయంలో కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు మూడు తలల ఏనుగు వచ్చిందన్న పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జరుగుతున్న ప్రచారం :

మహాకుంభమేళా వేళ.. ప్రయాగ్‌రాజ్‌లో అరుదైన దృశ్యం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మూడు తలల ఏనుగు వచ్చిందని ఆ పోస్ట్‌లో కామెంట్‌ చేశారు. ధర్మేంద్ర కేసరి అనే యూజర్‌ ఈ వీడియోను తన యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ పోస్ట్‌ చేశాడు. ఈనెల 7వ తేదీన తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ పోస్ట్‌ చేశారు. ‘మహాకుంభమేళా వేళ ప్రయాగరాజ్‌లో అద్భుతమైన మూడు తలల గజాననుడి దర్శనం’ అని ఆ వీడియో పోస్ట్‌కు క్యాప్షన్‌ పెట్టారు. అయితే, అంతకుముందునుంచే చాలామంది ఈ పోస్టు వైరల్‌ చస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది ఈ వీడియోను ఇదే వ్యాఖ్యానంతో పోస్ట్‌ చేశారు. అంతేకాదు.. పలువురు యూట్యూబ్‌లో కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.
(photo 1, 2)

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుంభమేళా ఫీవర్‌ నెలకొంది. ఆధ్యాత్మిక భావనలు పెల్లుబుకుతున్నాయి. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌ నిజమా? కాదా? అని భాస్కర న్యూస్‌ నిజనిర్థారణ చేసేందుకు నిర్ణయించింది. మొదట ఈ పోస్ట్‌లో ఉన్న మూడు తలల ఏనుగు అనే టెక్ట్స్‌తో గూగుల్‌లో టెక్ట్స్‌ సెర్చ్‌ చేశాం. కానీ, దీనికి నమ్మదగిన సమాచారం ఏదీ దొరకలేదు. అయితే, మూడు తలల ఏనుగు వీడియో నుంచి ఫోటోను వేరు చేసి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో పరిశీలించడం జరిగింది.

ఇలా శోధిస్తున్న సమయంలో @లవ్‌-6395 అనే యూట్యూబ్‌ ఛానెల్‌లోని షార్ట్‌లో అచ్చంగా ఇదే వీడియో పోస్ట్‌ చేశారు. 2024, మే 31వ తేదీన ఈ పోస్ట్‌ చేశారు. అయితే, అందులో ఇది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆయుతయ ఖోన్‌ ఫెస్టివల్‌లో ఈ వేడుక నిర్వహించినట్లు.. ఈ మూడు తలల ఏనుగు సంచరించినట్లు ఆ షార్ట్‌ డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. అయినా.. మరింత క్లారిటీ కోసం భాస్కర న్యూస్‌ శోధన కొనసాగించింది. ఈ సెర్చ్‌లో మరో ఫేస్‌బుక్ పేజీ ‘అయుతయ టూరిజం అండ్ స్పోర్ట్స్’లో దీనికి సంబంధించిన ఫుల్‌ ఈవీడియో కనిపించింది. ఈ ఉత్సవం థాయ్‌లాండ్‌లో జరిగిందనేది అర్థమైపోయింది.

ఈ వీడియో ప్రయాగ్‌రాజ్‌లో సంచరించిన ఏనుగు కాదు.. థాయ్‌లాండ్‌లో జరిగింది. అయితే, ఏనుగుకు మూడు తలలు ఉండటం ఏంటి అది సాధ్యమేనా? అనే సంశయం ఇంకా వెంటాడింది. దీనిపై భాస్కర న్యూస్‌ మరింత వివరంగా శోధించింది. అంతేకాకుండా.. ఆ వీడియోను అత్యంత నిశితంగా పరిశీలించడం జరిగింది. దీంతో, అసలు తత్వం బోధపడింది. ఆ వీడియోలో కనిపిస్తున్న ఏనుగుకు మధ్యలో ఉన్న తల మాత్రమే ఒరిజినల్‌. రెండు పక్కలా అమర్చిన తలలు రెండు కృత్రిమమైనవని అర్థమయ్యింది. ఆ థాయ్‌లాండ్‌ ఆయుతయ ఖోన్‌ ఫెస్టివల్‌కు సంబంధించిన ఫుల్‌ డీటెయిల్స్‌ సెర్చ్‌ చేయడంతో విషయం తెలిసింది. 2024లో మే 30 నుండి జూన్ 3వ తేదీ వరకు అయుతయ హిస్టారికల్ పార్క్‌లోని వాట్ మహత్‌లో ఈ ఫెస్టివల్ జరిగింది. ఈ ఉత్సవాలతో మూడు తలల ఏనుగును వీధుల్లో ఊరేగిస్తున్నట్లు చూపించారు. థాయిలాండ్‌లోని ప్రావిన్స్ లో ఈ ఫెస్టివల్‌ జరిగింది. అక్కడ జరిగిన ఈవెంట్లలో మూడు తలల ఏనుగును వీధుల్లో ఊరేగించారు.

అంతేకాదు.. ఈ అంశం గురించి శోధిస్తే ఆసక్తికరమైన చారిత్రక విషయాలు కూడా తెలిశాయి. థాయ్ లాండ్‌లోని ఎరావాన్ మ్యూజియంలో 3 తలల ఏనుగు భారీ శిల్పం ఉంది. కింద దానిని కూడా గమనించవచ్చు. దీనిని ఎరావన్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ పురాణాలలో ఐరావత్‌కు మరొక పేరు. థాయ్‌లో ఎరావన్‌ అని పిలుస్తారు. మూడు తలల ఏనుగుపై ఇంద్రుడు స్వారీ చేస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి.

==============================================================
వైరల్‌ అవుతున్నదేంటి ?

కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ వీధుల్లో మూడు తలల ఏనుగు సంచరిస్తోంది.

వాస్తవం ఏంటి ?

ఇది థాయ్‌లాండ్‌లో జరిగిన ఉత్సవంలోని దృశ్యం. మన భారతదేశంలో కాదు. ఈ ఏనుగుకు నిజంగా మూడు తలలు లేవు. విజువల్‌ ఎఫెక్ట్‌కోసం, టూరిస్టులను ఆకర్షించడం కోసం ఏనుగు తలకు రెండు వైపులా మరో రెండు కృత్రిమ తలలను అమర్చారు.

భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :

సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. తప్పుదారి పట్టించే ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ పరిశీలనలో ఈ విషయం వెల్లడయ్యింది.

==============================================================

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com