కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొట్టమొదటి సారిగా వైఎస్‌ఆర్ కడప జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సంవత్సరం మహానాడును పార్టీతో పాటు నేతలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా పక్క ప్రణాళికతో, కట్టుదిట్టమైన క్రమశిక్షణతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం అన్నది ఆ పార్టీ అధినేతకే సామాన్య కార్యకర్తకు కూడా చాలా అపురూపమైన విషయం. ఇంతకు ముందు చాలా సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది, అనేక సార్లు ప్రతిపక్షానికే పరిమితమైంది. ఓడి పోయిన ప్రతి సారి అంతే పట్టుదలతో బౌన్స్ బ్యాక్ అయి అధికారం చేపట్టే వారు చంద్రబాబు. అయితే ఈ సారి అధికారం చేపట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. ఈ సారి అధికారంలోకి గనక రాకపోతే పార్టీ ఏమైపోతుందో ఊహించలేని పరిస్ధితి. అందువల్ల 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేనలతో కూటమి కట్టి అధికారంలోకి రావడమనేది టీడీపీకి పునర్జన్మలాంటిదే అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ స్ధాపించిన తరువాత ఎన్నో ఢక్కామొక్కీలు తినింది. ఈ 42 సంవత్సరాల్లో చాలా కాలం అధికారంలో ఉంది. అనేక సార్లు కింద పడింది… మళ్ళీ అదే లేచి నిలబడి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న కాలంలో ఏకబికిన రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చుంది. రాష్ట్ర విభజన తరువాత ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు తన చాణక్యంతో పార్టీని మళ్ళీ అధికారంలోకి తసుకు వచ్చారు. 1983లో స్ధాపించిన తెలగుదేశం పార్టీ 2019 వరకూ చావో రేవో అనే పరిస్ధితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. అధికారం కోల్పోయినా మళ్ళీ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి తిరిగి అధికారం కైవశం చేసుకునే వారు. 1995 ఆగస్టులో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింతరువాత టీడీపీని కూడా కైవశం చేసుకున్నా పార్టీ క్యాడర్ యావత్తూ చంద్రబాబు వెంటే నిలబడింది. దీంతో ఆ సందర్భాన్ని పార్టీకి వచ్చిన జీవన్మరణ సమస్యగా ఎవరూ పెద్దగా గుర్తించరు. కానీ 2019లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ అధినాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్ అనుభవించిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఈ 2019 – 2024 మధ్య కాలంలో పార్టీ మన గలుగుతుందా అన్నంత ఆందోళన ప్రతి దేశం కార్యకర్త మెదళ్ళను తొలిచేస్తూ ఉండేది. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుత టీడీపీకి చుక్కానీ వంటి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్‌అవినీతి కేసులో అరెస్ట్ అయి 51 రోజులు రాజమండ్రీ సెంట్రల్ జైలులో గడిపారు. ఈ సందర్భంలో టీడీపీ సీనియర్ నాయకుల నుంచి క్షేత్ర స్ధాయి కార్యకర్తల నుంచి అందరూ చేష్టలుడిగి ఎటూ పాలపోక రాజకీయక్షేత్రం నుంచి దూరమైపోయారు.
అటువంటి విపత్కర పరిస్ధితులను చేధించుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బేషరతు మద్దతుతో బీజేపీని సైతం కూడగట్టుకుని కూటమి కట్టి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం సొంతం చేసుకున్నారు చంద్రబాబు నాయడు. అంటే టీడీపీ దాదాపు చచ్చి బతికింది. ఇటువంటి పరిస్ధితుల్లో వస్తున్న మహానాడును విజయ గర్వంతో అత్యంత వైభవంగా చరిత్ర గుర్తు పెట్టుకునేలా మహానాడు కార్యక్రమం నిర్వహించాలనే డిమాండ్ క్షేత్ర స్ధాయి నుంచి బలంగా వచ్చింది. పార్టీ పునరుజ్జీవం పొందిన సందర్భంగా దేశం తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తిడిపోయేలా ఈ సారి మహానాడు నిర్వహించాలని నారాలోకేష్, చంద్రబాబులు కూడా ఉత్సాహంగా కార్యక్రమ రూపకల్పనకు సిద్దమైపోయారు. అయితే మధ్యలో పహ్లగామ్ లో ఉగ్రదాడి, తదనంతర పరిణామాల్లో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల తలెత్తిన యుద్ద వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మహానాడును ఈ సంవత్సరం రద్దు చేయాలనే ఆలోచన కూడా పార్టీ చేసింది. అయితే ఎంతో అణచివేత తరువాత దక్కిన విజయాన్ని మహానాడు ద్వారా ప్రతి తెలుగుదేశం కార్యకర్తా వేడుకలా చేసుకోవాలని ఆశపడుతున్నారని క్షేత్ర స్ధాయి నుంచి వస్తున్న డిమాండ్ కు తలొగ్గి మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే మహానడు మూడు రోజులు నిర్వహించాలా లేక ఒకటి లేదా రెండు రోజులు నిర్వహించాలా అని తర్జనభర్జనలు పడ్డారు. కానీ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ద వాతావరణ సమసిపోవడం పరిస్ధితులు సాధారణ స్ధితికి చేరుకోవడంతో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు.
మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చంద్రబాబు మహానాడు నిర్వహణ కమిటీకి సూచించారు. పార్టీ సిద్దాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించాలని సిఎం కమిటీకి చెప్పారు. మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలని షెడ్యూల్ తయారు చేస్తున్నారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మహానాడు కమిటీని చంద్రబాబు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు తయారు చేయాలని తీర్మానాల కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.