పాకిస్తాన్‌కు బలూచిస్తాన్ ప్రాంతం తలనొప్పిగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ-BLA దాడులు తీవ్ర చేయడం పాకిస్తాన్ సైన్యాన్ని బెంబేలెత్తిస్తోంది. వరుస దాడులతో పాకిస్తాన్ సైన్యం, పోలీస్ వ్యవస్థలు గందరగోళంలో పడిపోయాయి. పలుచోట్ల హైవేలను నిర్బంధిస్తూ, పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంటూ, పాక్ సైన్యం వాహనాలను పేల్చివేస్తూ బీఎల్ఏ ముందుకు సాగుతోంది. పాక్ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను అదుపులోకి తీసుకుంటూ ప్రభుత్వ సమాచార వ్యవస్థను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రజలను అణిచివేస్తోందన్న భావనతో, ఆ ప్రాంతం నుండి మొదలైన స్వాతంత్ర్య పోరాటం మిలిటెంట్ ఉద్యమంగా మారింది. ఇది ఆఫ్ఘన్ నగరం కాందహార్‌లో ప్రారంభమై, ఇప్పుడు 600 మంది సాయుధులతో ప్రబల శక్తిగా ఎదిగింది.
పాకిస్తాన్‌పై పగతో ఊగిపోతున్న బీఎల్ఏ ఇప్పటివరకు 51 ప్రాంతాల్లో 71 దాడులు చేసింది. “సినిమా ఇప్పుడే మొదలైంది” అనే శైలిలో పాకిస్తాన్ సైన్యానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. బలూచిస్తాన్ విషయంలో చరిత్రనూ వారు ఆయుధంగా మలుచుకుంటున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ బలూచులు కీలక పాత్ర పోషించారు. హుమాయున్‌కు తిరిగి భారతదేశం మీద పట్టును సాధించడంలో బలూచ్ గిరిజన నాయకుల మద్దతు ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఆ తరువాత ఔరంగజేబ్ కాలంలో కూడా బలూచులు తిరుగుబాటుకు దిగారు. ఇప్పుడు ఇది తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం కోసం సాగుతున్న పోరాటమేనంటూ బీఎల్ఏ చెబుతోంది.
భారీగా ఖనిజ సంపదలున్న బలూచిస్తాన్.. బంగారం, బొగ్గు, సహజ వాయువు, చమురు వంటి వనరులతో సమృద్ధిగా ఉండి కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారింది. జర్మనీ అంత భూభాగం ఉన్నా కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే నివసిస్తున్న ఈ రాష్ట్రం, పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరమయ్యింది. అదే ద్వేషాన్ని, బాధను ఆయుధంగా మార్చుకుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 2005లో మొదలైన తిరుగుబాటు ఇప్పటికీ కొనసాగుతుండగా, ఇప్పుడు అంతర్జాతీయ మద్దతు పొందాలన్న యత్నాలు చేస్తోంది. భారత్ సహా ఇతర దేశాలు తమ వ్యూహాలను బీఎల్ఏతో సమన్వయం చేసుకుంటాయా? అన్న చ్చ కూడా నడుస్తోంది. పాకిస్తాన్‌లో భద్రతా వ్యవస్థల పరాజయం, రాజకీయ అస్థిరత నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతంలో తలెత్తిన ఆగ్రహ జ్వాలలు.. ఒక కొత్త దేశం ఆవిర్భావానికి దారితీస్తాయా? అన్న అంశం.. అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది.