ఆసియాలో కోవిడ్-19 మహమ్మారి మళ్లీ ఉధృతమవుతోంది. జనసాంద్రత అధికంగా ఉన్న హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వేడి వాతావరణం ఉన్నా వైరస్ వ్యాప్తి ఆగకపోవడంతో అక్కడ ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ఈ కొత్త వేవ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ.. తీవ్రమైన కేసులు, మరణాలు కూడా నమోదవుతున్నాయి. అధికారులు ప్రజలకు బూస్టర్ డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని, టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు. హాంకాంగ్‌లో కేసులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన వారంలో పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరింది. 31 తీవ్రమైన కేసులు, మరణాలు నమోదు కాగా, వైరల్ లోడ్, ఆసుపత్రుల్లో చేరికలు కూడా బాగా పెరిగాయి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తిరిగి పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అటు.. సింగపూర్‌లోనూ మే 3వ తేదీ నుండి వారం రోజుల్లో కేసులు 28 శాతం పెరిగి 14,200కు చేరాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య కూడా 30 శాతం పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, కొత్త వేరియంట్లు పెరుగుదలకు కారణమని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, 2020-21 యేడాదిలో జరిగిన భారీ విజృంభనతో పోల్చితే ప్రస్తుతం తీవ్రత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. బూస్టర్ డోసులు తీసుకోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం వంటి చర్యలను కొనసాగించాలని సూచనలు జారీ చేసింది.
కేసుల పెరుగుదలతో చైనా సైతం జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, మే 4వ తేదీ వరకు గడిచిన ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రుల్లో పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. గత వేసవిలో నమోదైన గరిష్ఠ స్థాయికి ఇది చేరుకోవచ్చని అంచనా. జీరో-కోవిడ్ విధానాన్ని విరమించుకున్నప్పటికీ, కొత్త వేరియంట్లు, రోగనిరోధక శక్తి తగ్గడమే కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో టీకా కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడం, ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు సిద్ధం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
ఈ పరిస్థితులు సామాజిక, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కోవిడ్ బారిన పడటంతో తైవాన్‌లో జరిగే కచేరీలు రద్దవ్వడం, సాంస్కృతిక రంగంపై ప్రభావం చూపిస్తోంది. సింగపూర్‌లో ఆసుపత్రుల్లో ఒత్తిడి పెరగడం కారణంగా ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పెరుగుతోంది. ఇది పర్యాటక రంగానికి కూడా ప్రతికూలంగా మారొచ్చంటున్నారు. చైనాలో కేసుల పెరుగుదల సప్లై చైన్‌లు, అంతర్జాతీయ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు. ఎందుకంటే చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కొత్త వేవ్‌ను ఎదుర్కోవడంలో ఆరోగ్య నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు బూస్టర్ డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని, స్వీయ పరీక్షల కిట్లు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచడం ద్వారా కేసులను త్వరగా గుర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్‌లో ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, ఆసియాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు భారత్‌ను అప్రమత్తం చేస్తున్నాయి. గతంలో గణనీయమైన నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో, టీకాల పంపిణీ, ఆసుపత్రి సౌకర్యాల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్ సదుపాయాల పెంపు వంటి చర్యలను ముందస్తుగా చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.