-
భూమన లేవనెత్తిన అంశాలపై స్పష్టత
-
ఆరోపణలు ఖండిస్తూనే మరణాల చిట్టా విప్పారు
-
గోవులు చనిపోయాయన్న ఈవో శ్యామల రావు
-
మరణాలు సహజమే అంటున్న టీటీడీ చైర్మన్
-
బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై దుమారం
-
ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎవరికి లాభం?
-
ఈ వివాదంపై అసలు భక్తులేమనుకుంటున్నారు?
తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాలలో గోవుల మరణాల అంశం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది అసలు సమస్య పక్కకు పోయి.. రాజకీయ వివాదంగా మారిపోయింది.
వైసీపీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి లేవనెత్తిన అంశాలతో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా.. తిరుమల స్వామివారి గోశాలలో అపచారం జరిగిపోతోందని భూమన ఆరోపించారు. మూడు నెలల్లోనే వంద గోవులు మరణించాయని కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. అయితే, ఆ ఆరోపణలను సమీక్షించుకోవాల్సిన టీటీడీ అధికారులు, పాలక మండలి ముందుగా ప్రత్యారోపణలకు దిగారు. అక్కడే తప్పులో కాలేశారు. అసలు భూమన ఆరోపణలు అసత్యమని ఖండిస్తూనే.. అదే వేదికపై నుంచి గోవుల మరణాల లెక్కలు చెప్పేశారు. గోవులు చనిపోయాయని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. ఇక, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరో అడుగు ముందుకేసి గోవుల మరణాలు సహజమే అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. ఇంట్లో మనుషులే చనిపోతున్నట్టే గోవులు కూడా చనిపోవడం తేలికైన అంశం అన్నట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. భక్తుల మనోభావాల సమస్యగా మారింది. మరి.. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎవరికి లాభం చేకూరుస్తాయి? ఈ వివాదంపై అసలు భక్తులేమనుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
ఫ్రస్ట్రేషన్లో బూమరాంగ్ :
వచ్చిన ఆరోపణలను, విమర్శలను సమీక్షించుకోవడానికి బదులు టీటీడీ అధికారులు, పాలకవర్గం ఫ్రస్ట్రేషన్లో తప్పులో కాలేసినట్లు అర్థమవుతోంది. ముందుగా ఆరోపణలను తిప్పి కొట్టాలన్న ఆలోచన బూమరాంగ్ అయ్యింది. అయితే, నష్ట నివారణ ఇప్పుడు సాధ్యం కావడం లేదు. విషయం అంతా భక్తుల్లోకి వెళ్లిపోయింది.
వరుస వివాదాలు :
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అయితే, వాటిని తిప్పికొట్టే క్రమంలో టీటీడీ భంగపాటుకు గురవుతోంది. మొదట స్వామివారి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి వివాదాన్ని ప్రభుత్వమే పనిగట్టుకొని బయటపెట్టింది. అయితే, కొన్నాళ్లపాటు ఆ ప్రకంపనలు కొనసాగినా.. చివరకు సర్కారు అభాసు పాలయ్యింది. ఆ తర్వాత వైకుంఠద్వార దర్శనం టికెట్ల జారీ క్యూ లైన్లలో తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం టీటీడీ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక, ఇప్పుడు గోశాలలో గోవులు మరణాల అంశంతో టీటీడీకి తల బొప్పి కడుతోంది.
భూమన ఆరోపణలు :
తిరుమల ఎస్వీ గోశాలలో మూడు నెలల్లోనే అధికారుల నిర్లక్ష్యంతో వందకి పైగా గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.తిరుమల తిరుపతిలో పర్యవేక్షణ కొరవడుతోందని, పవిత్రమైన స్వామివారి క్షేత్రంలో అపచారాలు జరిగిపోతున్నాయని భూమన ఆరోపించారు. గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే గోమాతలు భారీగా చనిపోతున్నాయన్నారు. గోశాల యాజమాన్యం గోవుల ఆలనాపాలన సరిగా చూడకపోవడంతో ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. గోశాలను గోవధ శాలగా మార్చారంటూ ఆయన ధ్వజమెత్తారు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్షం, ఔషధాల లోటు వంటి కారణాలే గోశాలలో గోవుల మరణలకు కారణమని విమర్శించారు. అంతేకాదు.. చనిపోయిన ఆవులు, లేగదూడల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
ఈవో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ :
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతోనే టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆరోపణలు చేశారని ఈవో జే శ్యామలరావు కౌంటర్ ఇచ్చారు. అయితే, ప్రతి నెలా సగటున 15 ఆవులు వయోభారంతో, వ్యాధులతో చనిపోతాయని ఈవో చెప్పారు. 2024లో 179 గోవులు చనిపోగా 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనని, ఈ ఏడాది ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని శ్యామలరావు చెప్పారు. ఇలా భూమన ఆరోపణలు ఖండిస్తూనే ఈవో గోవులు చనిపోయిన విషయాన్ని వెల్లడించారు. అంతటితో ఆగకుండా.. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లు, గణాంక ఆధారాలను, టీటీడీ గోశాలలో జరిగిన దుర్వినియోగాలంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
టీటీడీ చైర్మన్ రెస్పాన్స్ :
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. గోశాల విషయంలో భూమన చేసిన ఆరోపణలు తప్పు అని కొట్టి పారేశారు. అయితే, ఆ వెంటనే.. అనారోగ్యం, వృద్ధాప్యమే గోవుల మరణాలకు కారణమన్నారు. భూమన ప్రదర్శించిన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ప్రత్యారోపణలు చేశారు. అంతటితో ఆగకుండా.. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వర్క్ ఆర్డర్లు ఇచ్చి.. కమీషన్లు తీసుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. భూమనపై కేసులు పెడతామని కూడా బీఆర్ నాయుడు హెచ్చరించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో భూమన హస్తం ఉండవచ్చని కూడా సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ నాయుడు.
నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు :
మరోవైపు.. గోవుల మరణంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయంటున్నారు. 22 గోవులే చనిపోయాయని, ఇంట్లో మనుషులే చనిపోతున్నప్పుడు గోవులు చనిపోవడం సాధరణమే అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరాలను లేవనెత్తాయి.
టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా భూమనపై ఆరోపణలు చేస్తూనే గోవులు చనిపోవడం నిజమేనని అంగీకరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం ఇవన్నీ ఫేక్ న్యూస్‌లు, మార్ఫింగులు అని ఆరోపిస్తూనే నలభై వరకు గోవులు చనిపోయాయని చెప్పారు.
భక్తుల్లో అయోమయం :
ఈ పరిణామాలు.. భక్తుల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. గోశాలలో గోమాతల మరణంపై వాస్తవ పరిస్థితిని వివరించాల్సింది పోయి.. సమీక్షించుకోవాల్సింది పోయి.. ఓవైపు.. టీటీడీ ఈవో, మరోవైపు.. టీటీడీ చైర్మన్ దీనికి సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ.. ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కుణాకర్ రెడ్డిపై కేసులు పెడతామంటూ ఇద్దరూ వ్యాఖ్యానించడం సందిగ్ధం సృష్టించింది. ఈ క్రమంలోనే గో శాలలో గోవుల మరణాల చుట్టూ వివాదం ముదురుతోంది. వాస్తవ పరిస్థితి పక్కకు పోయి.. రాజకీయ రగడ నెలకొంటోంది. భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.