- విదేశీ యోగులు, సాధువుల జోరు
- ప్రపంచ ఆధ్యాత్మిక హృదయంగా భారత్
- మన సంస్కృతి, సంప్రదాయాలను చూసి పులకిస్తున్న విదేశీయులు
- ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమళాన్ని అందించిన భారత్
- భక్త జన పారవశ్యంలో టెంట్ సిటీ
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. భక్త జన ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. అనేక రకాల యోగులు, సాధు పుంగవులు వైవిధ్యభరితమైన తీరులో తరలి వస్తున్నారు. ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈసారి మహాకుంభమేళాకు వచ్చిన సాధువులలో ఒక్కొక్కరిది ఒక్కక్క తీరు. స్వామీజీ వేష ధారణలో ఉన్నా ఆధునిక వాహనాలు నడుపుకుంటూ రావడం విచిత్రం. గుజరాత్ కు చెందిన స్ల్పెండర్ బాబా ప్రయాగ్ రాజ్ కు తన త్రీవీలర్ మోటార్ సైకిల్‌పై రావడం సంచలనం సృష్టించింది. ఆయన మేళా ప్రారంభం రోజు తన బైక్ పై వచ్చి ఘాట్ లో పవిత్ర స్నానం చేసి దేవుళ్లకు పూజలు చేశారు. హార్లీ డేవిడ్ సన్ మోటార్ సైకిల్‌పై టెంట్‌సిటీలో ఆయన ప్రయాణిస్తూ కనిపించారు. చాబీవాలా గా పేరుబడిన ఆ బాబా 14 రోజుల క్రితమే గుజరాత్ లో బయల్దేరి ప్రారంభం రోజుకి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు.
ఈ బాబా స్నానానికి దూరం…
ఇక చోటు బాబా అనే మరో స్వామీజీ కూడా అస్సాంలోని కామాఖ్య పీఠం నుంచి కుంభమేళాకు విచ్చేశారు. 32 ఏళ్లుగా ఆయన స్నానపానాదులకు దూరంగా ఉన్నారు.కేవలం మూడే అడుగుల ఎత్తున్న ఈ బాబా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మహాకుంభమేళాను మిలన్ మేళా అని కూడా అనొచ్చని ఒకరి ఆత్మతో మరొకరి ఆత్మ కనెక్ట్ అయ్యే ప్రాంతం కుంభమేళా అనీ ఆయనన్నారు. తాను 32 ఏళ్లుగా స్నానమే చేయలేదని, ఈ మేళా లో కూడా తాను గంగలో మునిగి స్నానం చేయబోనని చోటుబాబా అన్నారు. కారణం తన మనసులో ఉన్న కోరిక నెరవేరలేదని కాబట్టి అది తీరే వరకూ తాను స్నానం చేయబోనని అన్నారు.
ఈ స్వామీజీ సివిల్స్ కోచింగ్ గైడ్…
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో మరో ఆకర్షణ.. చాయ్ వాలే బాబా.. గతంలో టీలు అమ్మిన దినేష్ స్వరూప్ బ్రహ్మచారి అనే స్వామీజీ 40 ఏళ్లుగా సివిల్ సర్వీసు అభ్యర్ధులకు కోచింగ్ ఇస్తున్నారు. అయితే ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఈయన ప్రత్యేకత. కేవలం సంజ్ఞలు, వాట్సప్ మెసేజ్ ల ద్వారా మాత్రమే ఆయన కోచింగ్ ఇస్తుంటారు. ఈ స్వామీజీ భోజనం చేయరు. కేవలం రోజుకు పది కప్పుల టీ తాగి ఉంటారు.
రబ్రీబాబా…
మహాకుంభ్ మేళాకు తరలి వచ్చిన సాధువుల్లో మరో స్వామీజీ రబ్రీ బాబా. ఆయన తన పురాతన 50 ఏళ్లనాటి అంబాసిడర్ కారులోనే ప్రయాగ్ రాజ్ కు వచ్చారు. ఈప్రపంచంలో తాను త్యజించలేనిది తన వాహనం ఒకటే అంటున్న ఆయన9 ఏళ్లుగా చేతి గోళ్లను సైతం తీసుకోలేదు.ఆయన వేళ్లకన్నా గోళ్లే పొడవుగా పెరిగిపోయాయి. టెంట్ సిటీకి విచ్చేసిన మరో ప్రముఖుడు మహా మండలేశ్వర్ అరుణ గిరి లేదా పర్యావరణ బాబాగా ప్రసిద్ధులు. ఆయన కొన్నేళ్లుగా మొక్కలు పెంచాలని ప్రజలకు హితవు చెబుతున్నారు.
విదేశీ యోగులు.. బాబాలు
వీళ్లే కాదు విదేశీ స్వామీజీలు, సాధువులు కూడా ఈ మహాకుంభమేళాకు విచ్చేశారు.మైఖేల్‌అనే అమెరికా మాజీ సైనికాధికారి ఒకరు ఈ మేళాకు విచ్చేశారు.తాను గతంలో అమెరికా ఆర్మీలో చేసేవాడినని.. కుటుంబం ఉండేదని కానీ ఈ ప్రపంచంలో సాధించాల్సింది మోక్షమే అని తెలుసుకుని సత్యాన్వేషణలో సనాతన ధర్మం బాట పట్టాననీ మైఖేల్ తెలిపారు. జూనా అఖాడాలో చేరిన ఆయన సనాతన ధర్మ మీద ప్రసంగాలు ఇస్తుంటారు.
వీళ్లే కాదు దక్షిణ కొరియాయూ ట్యూబర్లు, జపాన్ టూరిస్టులు, యూరోపియన్ యాత్రీకులు ఈ హైందవ ఉత్సవంలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ మహాకుంభమేళాకు తరలి వచ్చిన వారిలో బ్రెజిల్ కు చెందిన ఒక యోగ సాధకుడు కూడా ఉన్నారు.ప్రపంచ ఆధ్యాత్మిక హృదయం భారత దేశమేనని ఆయనన్నారు.144 ఏళ్లతర్వాత వచ్చిన ఈ మహోత్సవంలో పాల్గొనడమే అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాదు జై శ్రీరామ్ అని నినదించారు.ఫ్రాన్స్ నుంచి వచ్చిన మిలనీ అనే జర్నలిస్టు మహాకుంభమేళా కవరేజ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందన్నారు. ఒక ఆధ్యాత్మిక విశ్వాసంపై కోట్లాది మంది నమ్మకంతో తరలి రావడం చరిత్రలో నభూతో నభవిష్యత్ కావచ్చు.