- మహాకుంభమేళాలో మోడీ పవిత్ర స్నానం
- సరిగ్గా 11 గంటలకు ప్రధాని రాక
- త్రివేణిసంగమంలో అనేక సార్లు మునక
- భక్తితో పూజలు, తర్పణాలు వదిలిన మోడీ
- అంతకుముందు యోగీతో కలసి సంగమంలో బోటు విహారం
- అందరూ ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు పిలుపు
- ఢిల్లీలో పట్టుకోసం బీజేపి విశ్వ ప్రయత్నాలు
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమంలో ఆయన అనేక సార్లు పూర్తిగా మునిగి స్నానం చేశారు.కాషాయరంగు జాకెట్, నీలిరంగు బ్లూ ట్రాక్ పాంట్ ధరించి చేతిలో రుద్రాక్షలు పట్టుకుని పవిత్ర స్నానఘట్టానికి చేరుకున్నమోడీ అక్కడ స్నానం పూర్తి చేశారు. అనంతరం శ్లోకాలు చదువుకుంటూ పూజలు చేశారు. సాధారణంగా ఎవరైనా మూడు మునకలు వేస్తారు. కానీ మోడీ మాత్రం భక్తి ప్రపత్తులతో అనేక సార్లు మునిగి లేచారు.
బోటులో ప్రయాణం
అంతకుముందు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలసి త్రివేణి సంగమంలో బోటు ప్రయాణం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది రాకతో సంరంభంగా మారిన కుంభమేళా సరిగ్గా గతవారం తొక్కిసలాటలో 30 మంది మరణించడంతో విషాదంగా మారింది.మోడీ స్నాన ఘట్టంలోకి దిగి స్నానమాచరిస్తున్న దృశ్యాన్ని చూసేందుకు అనేకమంది భక్తులు వేల సంఖ్యలో గుమిగూడారు.
ప్రజాస్వామ్య పండుగ లో పాల్గొనండి
మహాకుంభమేళాకు బయల్దేరడానికి ముందు ఉదయం మోడీ తన ఎక్స్ ఖాతాలో ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజలందరూ ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవాలని, విరివిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ కోరారు. ఢిల్లీలో ఈసారి అధికారం దక్కించుకోడానికి బీజేపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ప్రముఖుల స్నానాలు
మహాకుంభమేళాలో స్నానమాచరించిన విఐపీ సెలబ్రిటీలలో ప్రధాని రెండవ వారు.. మొదట హోం మంత్రి అమిత్ షా గతవారం స్నానం ఆచరించారు.భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ కూడా కొద్దిరోజుల క్రితం కుంభమేళాలో పవిత్ర స్నానం చేసి పితృ తర్ఫణాలు వదిలారు. శాస్త్రోక్తమైన పూజలు చేశారు. అనంతరం ప్రయాగ్ రాజ్ లోని అనేక ఆలయాలను సందర్శించారు.ప్రయాగ్ రాజ్ లో రూ.5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ అనుమతులు మంజూరు చేశారు.ఈ సాంస్కృతిక సామూహిక మేళా కోసం ప్రయాగ్ రాజ్ ను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్చి దిద్దారు యోగీ.