తిరుపతి విష్ణు నివాసం వద్ద చోటు చేసుకున్న పెను విషాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు అధికారులు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలేంటనే దానిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తోంది సీఎం కార్యాలయం. ఇందులో ఎవరెవరి లోపం ఉంది..? దీనికి బాధ్యులెవరనే దానిపై సమాచారం తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తుతారని తెలిసినా.. ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానిపై సీఎం పేషీ అధికారులు సమాచారం సేకరించారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్ల జారీ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై కొందరు భక్తులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పోలీసుల పైనా భక్తులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో పోలీసుల వైపు నుంచి తీసుకున్న చర్యలేంటనే దానిపై నివేదిక కోరినట్టు సమాచారం. మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు ఉండగా.. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా.. గేట్లు తెరవడానికి కారణం ఎవరనే దాని పైనా సమాచారం తీసుకుంటోంది సీఎంఓ. స్థానికంగా ఓ డీఎస్పీ వ్యవహర శైలిపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ డీఎస్పీ ఎంత వరకు కారణం అనే అంశం పైనా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తుండడంతో మరింత ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడంతో పాటు.. అసలు ఈ ఘటనకు కారణమెవరు.. బాధ్యులెవరనే దాని పైనా ప్రభుత్వ యంత్రాంగం సీరియస్సుగా ఆరా తీసే పనిలో పడింది. సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లే సమయానికల్లా ఘటనకు కారకులు.. బాధ్యులెవరనే దానిపై సంపూర్ణ సమాచారం అందించేలా సీఎం పేషీ సమాచారం తీసుకుంటోంది.
- Advertisement with us -