భారతీయ ఎన్నికల వ్యవస్ధలోనే ఏదో లోపం ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బోస్టన్ లో ప్రవాస భారతీయులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఎన్నికల వ్యవస్ధ రాజీ పడినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన మహరాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం రెండు గంటల వ్యవధిలో 65 లక్షల ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల సంఘం చెప్పిందని ఇది నమ్మశక్యంగా లేదన్నారు. ఒక ఓటరు తన ఓటును నమోదు చెయ్యడానికి కనీసం మూడు నిమిషాల సమయం పడుతుందని దీన్ని బట్టి చూస్తే రెండు గంటల సమయంలో అన్ని లక్షల మంది ఓటు ఎలా వేయగలరని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఏదో తప్పు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని రాహుల్ గాంధీ సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడినట్లు ఇక్కడే అర్ధమవుతోందని ఈ వ్యవస్ధలోనే ఏదో తప్పిదం ఉందని నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించానని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలోనే మేము పోలింగ్ వీడియోలు చూపించమని అడిగితే మా అభ్యర్ధనను ఈసీ తోసిపుచ్చిందని, ఇప్పుడు అసలు వీడియోలు చూపించమని అడకూడదని చట్టాన్నే మార్చేశారని రాహుల్ గాంధీ వివరించారు.