38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

నాడు జగన్.. నేడు రేవంత్..

  • సర్కార్ ల కీలక నిర్ణయం.. జంక్షన్ లో టాలీవుడ్
  • తెరపైకి చిన్నబడ్జెట్ సినిమాల చర్చ

సంథ్యా థియేటర్ తొక్కిసలాట విషాదం నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టిక్కెట్ రేట్లను పెంచేది లేదని  రేవంత్ అసెంబ్లీ సాక్షిగా కరాకండీగా తేల్చేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ఇది అమలవుతుందని కుండబద్దలు కొట్టారు. దీంతో  భారీ బడ్జెట్ సినిమాల పరంపర, చిన్ని సినిమాల భవితవ్యంపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.

అప్పట్లోనే జగన్ నిర్ణయం..

ఈ సమయంలో అనుకోకుండానే వైసీపీ అధినేత జగన్మోనరెడ్డి తాను ముఖ్యమంత్రిగా తీసుకున్న టిక్కెట్ రేట్ల తగ్గింపు నిర్ణయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన ఈకీలక నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. ఆకాశాన్నంటుతున్న సినిమాల బడ్జెట్లు, వాటికి బెనిఫిట్ షోలు ఆదాయ మార్గాలుగా మారడంపై అప్పట్లో జగన్ కొరడా ఝుళిపించారు. జీవో 35 ప్రకారం టిక్కెట్ రేట్లను పెంచకుండా నియంత్రిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంతో బడా సినిమా నిర్మాతలకు ఈ నిర్ణయం రుచించలేదు. దానిపై హై కోర్టుకు వెళ్లారు. అయితే  హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ జీవోను రద్దు చేసింది. టిక్కెట్లు పెంచుకోవచ్చంటూ తీర్పు నిచ్చింది. దీంతో ప్రభుత్వం  ఆ తీర్పును సవాల్ చేస్తూ డివిజనబెంచ్ కు అపీల్ చేసింది. మరోవైపు  అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా వీలు చిక్కినప్పుడల్లా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడూ డైరెక్ట్ గా కొందరు… ఇన్ డైరెక్ట్ గా కొందరు బహిరంగ వేదికలపైనే విమర్శలు చేశారు.

హీరో నాని లాంటి వారు  టిక్కెట్ ధరలను పెంచకుండా అడ్డుకుని అవమానించిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే సామాన్యుడికి  సినిమా అందుబాటులోకి తేవాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఎవరికైనా ఇబ్బందులుంటే  జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని, ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందని బొత్స లాంటి నేతలు కూడా  మధ్యే మార్గంగా మాట్లాడారు. ఈనిర్ణయం తర్వాతే అగ్రహీరోల భారీ బడ్జెట్ మూవీస్ అంశం ఒక్కసారిగా చర్చకు వచ్చింది. క్రేజ్ ఉందన్న ఒకే కారణంతో వారికి భారీ రెమ్యునరేషన్లు ముట్ట చెబుతూ సినిమాలని హై బడ్జెట్ మూవీస్ గా ప్రచారం చేయడం వాటి కలెక్షన్ల కోసం టిక్కెట్ రేట్లు ఇష్టాను సారం పెంచుతున్నారన్న  వాదనలూ రేగాయి.

మెగాస్టార్  ఆధ్వర్యంలో బృందం

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అప్పట్లో ఓ బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరి అమరావతికి వెళ్లింది. మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, లాంటి  అగ్ర స్థాయి సినీ వర్గం ఈ బృందంలో ఉంది. తాడేపల్లి సీయం క్యాంపు కార్యాలయంలో జగన్నుకలసి పరిస్థితి వివరించింది. నిర్మాతలు బతికేలా నిర్ణయాల్లో వెసులు బాటుచేయాలని ఆ సందర్భంగా చిరంజీవి జగన్మోహనరెడ్డిని కోరారు. అప్పుడే అగ్రహీరోల సినిమాలకు పది శాతం టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చనే మధ్యే మార్గ నిర్ణయం వెలువడింది. అయితే అగ్రహీరోల మూవీ బడ్జెట్ వివరాలను తమ ముందుంచాలని కూడా ప్రభుత్వం సూచించింది. హీరో రెమ్యునరేషన్, సినిమా నిర్మాణానికి అయిన అంచనా వ్యయం పూర్తి లెక్కలు జీఎస్టీతో సహా తమ ముందుంచాలని దాని ప్రకారం టిక్కెట్ రేట్లు పెంపు నిర్ణయం ఉంటుందని మెలిక పెట్టింది.

హీరో రెమ్యునరేషన్ పెద్ద బండ..

వాస్తవానికి అగ్రహీరోల బడ్జెట్ఈ మధ్య కాలంలో ఆకాశాన్నంటుతోంది. హిట్ టాక్ ఉన్న హీరోలతో సినిమా చేయాలంటే  వందలకోట్లు ఖర్చుపెట్టాల్సిందే.  అయినా నిర్మాతలు ఈ ట్రెండ్ కు అలాటు పడ్డారు. అంచనాలకు మించి, శక్తికి మించి నిర్మాణ వ్యయంతో భారీ భారీ సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టారు.  దాని ప్రమోషన్ కోసం మరింత ఖర్చు, ఆ తర్వాత బెనిఫిట్ షోల పేరిట  ఆ సొమ్మును వెనక్కు రాబట్టుకోవడం ఆనవాయితీగా మారింది.డిమాండ్ ను బట్టి  తీసుకుంటే తప్పేంటని  మరికొందరు హీరోలు కామెంట్ చేశారు.

సినిమా తీసిన ఖర్చులో ముప్పాతిక వంతు  హీరో రెమ్యునరేషనే  ఉండటం, అందుకే  నిర్మాతలు విడుదలయిన తొలి నాళ్లలోనే  దాని ఖర్చు రాబట్టుకోవాలన్న ఉబలాటంలో టిక్కెట్ రేట్లు దారుణంగా పెంచేస్తూ పోవడం  అందరికీ తెలిసినదే. వైసీపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమ లో  అధికంగా ఉన్న  ఓ సామాజిక వర్గానికి అస్సలు రుచించలేదు.  దాంతో జగన్ పై ఇండస్ట్రీలో మెజారిటీ వర్గం బాహాటంగానే విషం కక్కింది. వీరిలో ప్రస్తుత జనసేనాని  పవన్ కల్యాణ్ ముందు వరసలో ఉన్నారు. అయినా అప్పటి ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.

ఏపీకి రండి.. రాయితీలిస్తాం..

ఈ వివాదం ఇలా ఉంటుండగానే ఏపీ ప్రభుత్వం అప్పట్లో మరో ప్రకటన చేసింది. సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వస్తే భారీ రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. విశాఖ పట్నం లాంటి  నగరాలు సినిమా ఇండస్ట్రీ  హబ్ గా ఎదగాలని  కోరింది.  సినిమా పునర్వైభవానికి,  గ్రోత్ ఇంజన్ లాంటి  విశాఖ లోంచి భవిష్యత్తు ఉంటుందని , ఇండస్ట్రీకి, ఏపీకి మంచి జోష్ వస్తుందని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.కానీ   సినీ ఇండస్ట్రీ ఈ  పిలుపును అస్సలు పట్టించుకోలేదు. చిన్న సినిమా నిర్మాతలు ఇప్పటికీ ఏపీలొకేషన్లను వాడుకుంటూ మంచి నాణ్యమైన సినిమాలు తీస్తున్నా.. మెజారిటీ ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ ను వదలి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

అనంతర కాలంలో వై సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో టాలీవుడ్ పరిశ్రమలో మెజారిటీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. నాగ్ అశ్విన్ లాంటి డైరక్టర్లు జగన్ ఓటమికి  సంతోషిస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు కూడా.

మెగా కాంపౌండ్ ఆలోచన ఏంటి?

మరిప్పుడు రేవంత్ నిర్ణయం పై  టాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారు. మళ్లీ మెగాస్టార్ చిరంజీవి ముందుకొస్తారా? చర్చలకు నాయకత్వం వహిస్తారా? అసలే తనయుడు చెర్రీ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతికి విడుదల అవనుంది. అదే మూవీ నిర్మాత, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు  ఈ చర్చలకు సంధాన కర్తగా వ్యవహరిస్తారా? రేవంత్ ది ఆవేశ పూరిత నిర్ణయమా? లేక చర్చలతో మెత్తబడతారా?  అన్నది చూడాలి.

చిన్న సినిమా బతకొద్దా?

ఏదేమైనా భారీ బడ్జెట్ మూవీ క్రేజ్ నిర్మాతల పాలిట, ఇండస్ట్రీ పాలిట సమస్యగా మారుతోందన్నది మాత్రం వాస్తవం. చిన్న సినిమాలకు చోటు లేదు. వారికి థియేటర్లు ఉండవు. అగ్ర సినిమా హీరో విడుదల అంటే థియేటర్లన్నీ ఆక్యుపై అయిపోతాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో  మెజారిటీ థియేటర్లు అగ్రహీరోల కుటుంబాల ఖాతాలోనే ఉన్నాయి. ఈ టెండ్ మూవీ ఇండస్ట్రీలో అసహజ ధోరణులకు  దారితీస్తోంది.కళామతల్లి ముద్దుబిడ్డలమని చెప్పుకునే 24 క్రాఫ్ట్స్ సిబ్బంది  ఈ హై బడ్జెట్ మూవీల పరంపరలో బలిపశువుల్లా మారుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com