32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

దేశంలోనే అతిపెద్ద మూడో భూస్వామి వక్ఫ్‌ బోర్డ్‌

భారతదేశంలో అత్యధిక భూమిని ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? భారతీయ రైల్వే బోర్డు మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో సాయుధ దళాలు, మూడవ అతిపెద్ద భూస్వామిగా వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డు ఆధీనంలో 8.7 లక్షల స్థిర మరియు చరాస్తులు ఉన్నాయి. వీటిలో 9.4 లక్షల ఎకరాల భూమి ఉంటుంది. దీని మొత్తం విలువ రూ. 1.2 లక్షల కోట్లుగా అంచనా. ఈ భూములను మసీదులు, మదర్సాలు, అనాథ ఆశ్రమాలు, శ్మశాన వాటికలు, మరియు ఇతర ధార్మిక, సామాజిక సేవలకు ఉపయోగిస్తారు.

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంపై సవరణ బిల్లు 2025ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ చట్టం 1995లో రూపొందించబడింది. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సినవి. మసీదులు, మదర్సాలు, అనాథ ఆశ్రమాలు, శ్మశాన వాటికలు, ఇతర ధార్మిక సంస్థలకు ఈ భూములను ఉపయోగిస్తారు. అయితే, పెద్ద సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కావడం, అసమర్థ నిర్వహణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

2006లో సచార్ కమిటీ నివేదిక ప్రకారం, సుమారు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉన్నాయి. 13,000 ఆస్తులపై కోర్టు కేసులు ఉన్నట్లు పేర్కొంది. 4.35 లక్షల ఆస్తుల గురించి పూర్తి సమాచారం లేదు. వక్ఫ్ బోర్డు వ్యవస్థాపక వ్యవహారాలపై నియంత్రణ లేకపోవడం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తుల అన్యాక్రాంతం జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టం అవసరమని నొక్కి చెబుతోంది.

కొత్త బిల్లు ప్రకారం, వక్ఫ్ బోర్డులో సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర పెరుగుతుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను నియమించాలని, ఇద్దరు ముస్లిం మహిళలను కూడా సభ్యులుగా చేర్చాలని ప్రతిపాదించారు. వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కల్పించారు. 6 నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఈ బిల్లు పేర్కొంటోంది.

ఈ సవరణలను ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఆధిపత్యం పెంచాలని చూస్తోందని, సమాజానికి నష్టం కలుగుతుందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం నివారించడమే లక్ష్యమని చెబుతోంది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం, ఈ ఆస్తుల సక్రమ వినియోగం జరిగితే ప్రతి ఏడాదికి రూ. 1.2 లక్షల కోట్లు ఆదాయం రావచ్చు. కానీ ప్రస్తుతం కేవలం 200 కోట్లే వస్తున్నాయి.

ఈ సవరణలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులపై ప్రభావం చూపనుండగా, వక్ఫ్ ఆస్తుల రక్షణ, వినియోగం, నిర్వహణలో స్పష్టమైన మార్గదర్శకాలను తీసుకొస్తాయని కేంద్రం భావిస్తోంది. ముస్లిం సమాజానికి నష్టం కలుగుతుందనే భయాలను ప్రభుత్వం కొట్టిపారేస్తూ, దీని వల్ల వక్ఫ్ ఆస్తులు మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని విశ్వసిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com