– లండన్‌లో వేలంలో భారతీయ కరెన్సీ రికార్డ్
భారతదేశానికి చెందిన ఓ వంద రూపాయల నోటు వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన వేలం పాటలో వంద రూపాయల నోటుకు అక్షరాలా 56లక్షల 49వేల 650 రూపాయలు పలికింది. అయితే, ఆ వంద రూపాయల నోటు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అందుకే వేలంలో ఈస్థాయిలో ధర పలికింది.
ఇప్పుడు వేలంలో రికార్డు ధర పలికిన వంద రూపాయల నోటును ‘హజ్‌నోటు’గా పరిగణిస్తారు. ఈ నోటును 1950వ దశకంలో ఆర్‌బీఐ ప్రింట్ చేసింది. 1970లో రద్దు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ వంద రూపాయల నోటు చెలామణిలో ఉంది.
అయితే, ఈ వంద రూపాయల నోటుకు ఆర్‌బీఐ ముద్రించే ఏ నోటుకూ లేని ప్రత్యేకతలున్నాయి. ప్రింట్ ఆర్‌బీఐ చేసినా భారతదేశంలో ఈ వంద రూపాయల నోటు చెలామణిలోకి తీసుకకురాలేదు. భారతదేశంలో చెల్లని ఈ వంద రూపాయల నోటు కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే చెల్లుబాటయ్యింది. ఈ విషయం వింటే ఎవరైనా అవాక్కవడం ఖాయం. కానీ, అదే నిజం.
హజ్ యాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. తమ జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్రకు వెళ్లాలని ముస్లింలు కోరుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కూడా హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తాయి. ప్రయాణ టికెట్లు చెల్లిస్తాయి. ఆ సదుపాయం మనదేశంలో కూడా ఉంది. అయితే, కేవలం హజ్ యాత్రకువెళ్లే భారతీయులకు ఉపయోగ పడేలా ఈ వంద రూపాయల నోటును భారత ప్రభుత్వం 1950ల్లో ముద్రించింది. దానిని మక్కాకు వెళ్లిన యాత్రికులు గల్ఫ్ దేశాల్లో అంటే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో మాత్రమే ఈ నోటును వినియోగించుకునే వారు.
అయితే, 1961లో కువైట్ తన సొంత కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. క్రమంగా మిగతా గల్ఫ్ కంట్రీలు కూడా తమదైన కరెన్సీని ముద్రించుకున్నాయి. దీంతో, ఈ కరెన్సీనోటు అవసరం తీరిపోయింది. దీంతో, 1970లో భారత ప్రభుత్వం ఈ వంద రూపాయల హజ్‌నోట్ల ముద్రణను ఉపసంహరించుకుంది.
ఇక, ఈ హజ్‌నోటు ప్రత్యేకతలు చూస్తే.. భారతదేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ కంటే ఈ నోటు డిఫరెంట్‌గా ఉంటుంది. కలర్ ఆకట్టుకునేలా ఉంటుంది. నోటు సీరియల్ నెంబర్ HA తో మొదలవుతుంది. అంటే.. హజ్ యాత్రకు గుర్తుగా అన్నమాట. అంతేకాదు.. మిగతా కరెన్సీ నోట్ల కన్నా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఆ తర్వాత చెలామణిలోకి వచ్చిన రెండు రూపాయల నోటు అచ్చం ఈ వంద రూపాయల నోటు మాదిరిగానే ఉండేది.
ఈ నోట్లు ముద్రించడం ఆపేశాక ఎక్కడా వీటి ఆనవాళ్లు లేవు. కానీ, ఉన్నట్టుండి లండన్‌లో వేలంపాటలో కనిపించింది. హజ్ యాత్రతో ముడిపడి ఉండటం, మిగతా కరెన్సీకంటే భిన్నంగా ఉండటం, ఆర్‌బీఐ ముద్రించినప్పటికీ.. భారతదేశంలో ఈ నోటు చెల్లకపోవడం, కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే చెలామణి కావడం వంటి ప్రత్యేకతలు ఈ నోట్‌కు ఇంత డిమాండ్ రావడానికి కారణమయ్యాయి.