తెలంగాణలో ఊరిస్తోన్న రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు జూలు విదుల్చుకుంటోంది. ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పట్టాలెక్కించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలకమైన భూ సేకరణ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో భాగంగా ఉత్తర భాగంలో భూసేకరణ పూర్తిచేయడంతో పాటు.. దక్షిణ మార్గం అలైన్‌మెంట్ పైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలోని భూ సేకరణలో రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని మార్గదర్శనం చేశారు. మూడేళ్ల వ్యవధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రాష్ట్రంలోని 29,700 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సింగిల్, డబుల్ రోడ్లను విస్తరించాలన్నారు. అన్నదాతలకు సౌకర్యవంతంగా ఉండేలా.. పంటపొలాలకు రైతులు సులువుగా చేరుకునేలా నేషనల్ హైవేలపైనా అండర్‌పాస్‌లు నిర్మించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. భూ సేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చర్చించాలని, తరచూ రైతులతో సమావేశం కావాలని రేవంత్‌రెడ్డి సూచించారు. రహదారుల నిర్మాణాలతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరిస్తూ.. భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. ట్రిపుల్ ఆర్‌కు సంబంధించి దక్షిణ భాగానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందున హెచ్ఎండీఏతో అలైన్‌మెంట్ చేయించాలని సూచించారు. హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగు రోడ్డు, ట్రిపుల్ ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం సూచించారు.
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అనే తేడా లేకుండా రోడ్లన్నీ ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలన్నారు. వీటికి సంబంధించి కన్సల్టెన్సీలను నియమించాలని, డీపీఆర్‌లు పకడ్బందీగా తయారు చేయాలని, రహదారుల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తికావాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు. వారితో పది రోజులకోసారి సీఎస్ సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని, ఇక్కడ కాకపోతే ఆర్ అండ్ బీ, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులతో సమావేశమై.. అనుమతులు సాధించాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ సమస్య ఎదురుకాకుండా నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు.