తెలంగాణలో అధికార కాంగ్రెస్‌పార్టీ ఆల్‌హ్యాపీస్ అన్న ఆలోచనకు వచ్చింది. రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ పాలనపై సంతోషంగా ఉన్నట్లు అంచనాకు వచ్చేసింది. అందుకే ఇప్పుడిక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాలపై సమీక్షిస్తోంది. స్థానికంగా పట్టునిలుపుకుంటేనే పార్టీకి ఏ అంశంలోనైనా మద్దతు ఉంటుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో ఎఫర్ట్స్ పెట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది.
ప్రధానంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80శాతం సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ దిశగా రంగంలోకి మంత్రులను, ముఖ్యనాయకులను దించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాయకుల పర్యటనలతో పాటు.. ప్రాంతాల వారీగా కార్యకర్తలు, పార్టీ ఫాలోవర్లతో సన్నాహక సమావేశాలకు కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లాన్లు చేస్తోంది.
ఇక, రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచి, అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చింది. క్షేత్రస్థాయిలో సర్వే ఇప్పటికే పూర్తికాగా.. ఆ డేటా క్రోడీకరించే, కంప్యూటీకరించే ప్రక్రియ నడుస్తోంది. దీంతో ఏ సమయంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు మానసికంగా సిద్ధం చేసేందుకు పలువురు మంత్రులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గం హుస్నాబాద్‌తో పాటు సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు పూర్తిచేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. మంత్రి సీతక్క కూడా ములుగు నియోజకవర్గం పరిధిలో కార్యకర్తలతో భేటీ అయి.. పార్టీ ప్రగతిపై చర్చించారు. మిగతా మంత్రులు కూడా నియోజకవర్గాల ముఖ్యనేతలకు అందుబాటులో ఉంటూ.. నిత్యం వారితో చర్చలు జరపడంతో పాటు.. స్థానిక ఎన్నికలపై వాళ్లకు మార్గదర్శనం చేస్తున్నారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్.. స్థానికసంస్థలకు నిధులివ్వకుండా, అలాగే, ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు కూడా బిల్లులు విడుదల చేయకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే విమర్శలు మొదలెట్టారు. అంతేకాదు.. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా ఇతర వ్యాపకాలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లించిందని, ఫలితంగా సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైందని ఇలా.. వివిధ అంశాలను ముందుకు తెస్తోంది. ఇవే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులు, ముఖ్యనేతలు ఆయా ప్రాంతాల నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా.. గ్రామీణ స్థాయిల్లో స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వాటినే అస్త్రాలుగా మలచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
గత ప్రభుత్వ వైఫల్యాలే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిపైనా ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు, ఎన్నికల హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యేడాది పరిపాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అయితే, వీటిని జనం స్వీకరించేలా ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశాలపై కార్యకర్తలకు టీపీసీసీ దిశానిర్దేశం చేస్తోంది. పదేళ్లుగా ఎదురుచూసిన రైతులకు రుణమాఫీ.. రూ.2 లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేసిన అంశాన్ని రైతులు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచనుండటంతో బీసీ వర్గాలన్నీ ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ పెద్దలు, పీసీసీ ముఖ్యులు భావిస్తున్నారు. అంతేకాదు.. బీసీల పరంగా కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని, బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల పాటు బీసీలకు చట్టప్రకారం అందాల్సిన నిధులు విడుదల చేయలేదని, బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అంశాలపైనా విస్తృత ప్రచారం చేయాలని పార్టీశ్రేణులకు సూచిస్తోంది.