భారత్‌పై పాకిస్తాన్ దాడుల వ్యవహారంలో ఇప్పుడో దిమ్మదిరిగే విషయం బయటపడింది. అంతర్జాతీయ సమాజాన్ని భయపెట్టే అంశం తెలిసింది. భారత్‌పై దాడుల కోసం పాకిస్థాన్‌కు టర్కీ డ్రోన్లను అందిస్తోందన్నది ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలిసిన అంశం. కానీ, టర్కీ డ్రోన్లకు తోడు.. తమ సైనికులను కూడా పంపుతుందన్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సైనిక సహకారం ఇటీవల మరింత బలపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’లో టర్కీ సైనికులు పాల్గొన్నట్టు, అందులో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ సందర్భంగా పాకిస్థాన్ భారత భూభాగంలోకి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించగా, వాటన్నింటినీ భారత భద్రతా దళాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఆ డ్రోన్ల శకలాలను పరిశీలిస్తే.. అవి టర్కీకి చెందిన ‘అసిస్ గార్డ్ సోంగర్’ రకానికి చెందినవని నిర్దారణ అయ్యింది.
ఇటీవల కాలంలో పాకిస్థాన్‌కు టర్కీ అధునాతన డ్రోన్లను సరఫరా చేస్తోంది. వాటి ఆపరేషన్‌కి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులు ఇస్లామాబాద్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించినా, టర్కీ మాత్రం పాకిస్థాన్‌కు బాసటగా నిలవడం గమనార్హం. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఎటువంటి సానుభూతి వ్యక్తం చేయకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో టర్కీ, పాకిస్థాన్‌లు కలసి భారత్‌కు వ్యతిరేకంగా సైనిక, వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నాయన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.