దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంచిరేవుల గ్రేహౌండ్స్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని, వారి త్యాగాలకు మనం వెల కట్టలేమని శ్రీధర్ బాబు చెప్పారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం పోలీసులే అని వారి కోసం మనం ఎంత చేసినా తక్కువే అన్నారు. మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాబోయే పది సంవత్సరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని దేశంలోనే అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ధీటుగా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని తీర్చి దిద్దుతామని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ పోలీస్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు అకడమిక్స్ తో పాటు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. హోంగార్డు నుంచి మొదలుకుని డీజీపీ వరకూ అందరి పిల్లలు ఈ పాఠశాలలో చదువుకోవచ్చని మంత్రి అన్నారు. విద్యా, వైద్యంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామన్నారు. ఈ స్కూల్ నిర్మాణానికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని వారికి ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.