దక్షిణ తెలంగాణలోని పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం అసలు కేంద్రప్రభుత్వం పరిశీలనలోనే లేదని జల శక్తి శాఖ సహాయ మంత్రి రాజు భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ సమాధానం ఇచ్చారు. వాస్తవానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ‘ఈ ప్రాజెక్టు అంతరాష్ట్ర కృష్ణా జల వివాదం ట్రైబ్యునల్ ప్రతిపాదిత విధి విధానాల్లో చేర్చారు. కాబట్టి నీటి వినియోగంతో ముడిపడి ఉన్న ఈ అంశం కోర్టుల పరిధిలోకి వెళ్ళింది. దీంతో పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లెక్కలు చేపట్టడం వీలు కాదని.. ఈ కారణంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనను 2024 డిసెంబర్లోనే తిప్పి పంపించాం’ అని కేంద్రమంత్రి రాజభూషణ్ చౌదరి రాజ్యసభలో స్పష్టం చేశారు.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్ర ప్రబుత్వం క్లారిటీ ఇచ్చింది. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి.. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టమైన ప్రకటన చేశారు. మూసీనది పరీవాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలు, ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ప్రభావం గురించి ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఆయన సమాచారం ఇచ్చారు. మూసి పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో లేవని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ చెప్పారు. పురానాపూల్, పురాతన ద్వారం, చార్మినార్, కార్వాన్ టోలి మసీదు, బాద్ ఏ సాహి అశుర్ ఖానా, పురానాపూల్ మియా మిస్కు మసీదు, కోటి ఉమెన్స్ కాలేజీ బ్రిటిష్ రెసిడెన్సీలు తెలంగాణ ప్రభుత్వ వారసత్వ విభాగం పరిధిలోకి వస్తాయని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు.