కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలుగా తక్కువ… గులాబీ నాయకుడిగా ఎక్కువ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా కాంగ్రెస్‌లో స్వాతంత్రం అధికం. అయితే కాంగ్రెస్‌లో తరాలుగా ఉన్నవారితో పోలిస్తే బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
కడియం శ్రీహరి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు. పోచారం శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు.
పార్టీ మారిన వారిలో కడియం ఒక్కరే లాభపడ్డారనే పేరుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపి టికెట్ దక్కించుకుని గెలిపించుకున్నారు. కాలే యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కలిసొచ్చింది. డాక్టర్ సంజయ్ సీఎంతో టచ్‌లో ఉంటూ జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవడం… పెండింగ్ పనులను పూర్తి చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీ మారారు.
అరికె పూడి గాంధీ పార్టీ మారినా అంతగా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, మహిపాల్ రెడ్డిలు పార్టీ మారినా తమకు హామీ ఇచ్చిన పనులు కాలేదనే అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.
గద్వాలలో కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోటో పెడితే ఆయన నానా రచ్చ చేశారు. నా ఫోటో ఎందుకు పెట్టారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో కెటిఆర్‌ను కలిసి మంతనాలు సాగించి వెనువెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడటం వివాదాస్పదం అవుతోంది. తాను గులాబీ దళంలోనే ఉన్నానని అనుచరులతో చెపుతూ…చిన్నా చితకా కాంట్రాక్టు పనుల్లో బీఆర్‌ఎస్ వాళ్లనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వచ్చి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అయినా సరే ప్రకాష్ గౌడ్ ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా కారు నేతలతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు.
దానం నాగేందర్ పార్టీలో చేరాక సికింద్రాబాద్ ఎంపి టికెట్ ఇస్తే ఓడిపోయాడు. దీంతో కాంగ్రెస్‌లో ఆయన స్థానం కుదించుకుపోయినట్టయింది. హైదరాబాద్‌లో ఎవరూ లేరు తనకు మంత్రి పదవి ఇస్తారని వస్తే…అది ఆమడ దూరంలో ఊరిస్తోంది. దీంతో దానం చాన్స్ దొరికితే వార్తల్లో నిలిచే వ్యాఖ్యలు చేస్తున్నారు.
సామాన్యులంతా హైడ్రా బాగుందని ప్రశంసిస్తే…దానం నాగేందర్ మాత్రం హైడ్రా ఓవర్ చేస్తోందని, హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో చేరాక కూడా తన కార్యాలయంలో కెసిఆర్ ఫోటో ఉంచుకోవడంపై విమర్శలు రాగా….ఉంటే తప్పేంటని కెసిఆర్ అంటే తనకు అభిమానమని తేల్చి చెప్పారు.
తాజాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ మీద ఒంటికాలి మీద లేచారు. మాటలకందని బూతులతో కడిగేశారు. మహిపాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని వ్యాఖ్యానించిన మహిపాల్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఏకంగా కెసిఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరాక వీరి గురించి పట్టించుకున్ననాథుడే లేకుండా పోయాడు. అంగట్లోకి వెళ్లి అవ్వా అంటే ఎవరికి పుట్టినవు బిడ్డా అన్న చందంగా మారింది. కాంగ్రెస్ సముద్రంలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఓ వైపు పార్టీలోకి వచ్చేటపుడు ఇచ్చిన హామీలు నెరవేరటం లేదు. ఎవరిని కలిస్తే తీరుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దానికి తోడు సుప్రింకోర్టు శాసనసభ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై త్వరగా తేల్చాలని నోటీసుల్లో పేర్కొంది. కాంగ్రెస్ అధిష్టానానికి చికాకు పుట్టిస్తున్న వారిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారే. వీరందరు మంత్రి పదవి కోసం వచ్చి భంగపడ్డారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఒకవేళ అనర్హత వేటు పడితే ఎవరు పట్టించుకుంటారనే గ్యారంటీ లేదు. ఎంతకైనా మంచిదనే గులాబీ బాస్ తో టచ్ లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ వీరి విషయంలో ఇంకా స్పందించలేదు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి వీరి పరిస్థితి ఏంటో మాట్లాడే నేత లేకపోవడం గమనార్హం.