నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్ధానంలో రాజకీయ నాయకులందరూ లాంగ్ స్టాండిగ్ బ్యాట్స్‌మెన్‌లే. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా మంది నాయకులు ఇంకా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు తరం మారుతోంది. చాలా మంది సీనియర్ నాయకులు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నారు. టీడీపీలోనే కొనసాగుతున్నా వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు. కొంత మంది తెలివైన నాయకులైతే వాళ్ళ కుమారులనో, కుమార్తెలనో రంగంలోకి దింపి వారు వానప్రస్తం గడుపుతూ నియోజకవర్గాల్లో పట్టుకోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరు నేతలు తమకూ కావాలి, తమ సంతానానికి పదవులు కావాలని పట్టుబడుతున్నవారిని నిర్ధ్వందంగా పక్కన పెట్టెస్తోంది పార్టీ అధిష్టానం. మొత్తానికి ఈ పరిణామాలన్నీ పార్టీలో యువనేత, చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ ఆలోచనల మేరకే జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. వయసురీత్యా చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి ఎనభైయ్యో వడిలోకి దగ్గర పడతారు. ఈ పరిస్ధితుల్లో పార్టీ భారమంతా లోకేష్ మోయాల్సిన పరిస్ధితి ఇప్పటి నుంచే ఏర్పడింది. దీంతో టీడీపీలో కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం మొదలు పెట్టారు నారాలోకేష్.
పార్టీపైన నారాలోకేష్ ప్రభావం చాలా సంవత్సరాలుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది. 2013 ప్రాంతంలో టీడీపీలో క్రియాశీలం అయిన నారాలోకేష్ వచ్చీ రాగానే టీడీపీ సభ్యత్వం 60 లక్షలు దాటించి తన సత్తా చాటుకున్నారు. అదే సమయంలో కార్యకర్తల సంక్షేమ నిధి అని స్ధాపించి టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వెళ్లి ఆదుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అలాగే టీడీపీ సభ్యత్వంతో పాటు ప్రతి కార్యకర్తకు ప్రమాద భీమా వర్తింపచేసి శ్రేణుల్లోకి దూసుకుపోయారు. ముందుగా యావత్ టీడీపీ కార్యకర్తల యాక్సెప్టెన్సీ తెచ్చుకున్నారు. ఇక పార్టీపై లోకేష్ పట్టు మరింత పెరిగిందనడానికి మరో ఉదాహరణ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం కొత్త ముఖాలకు అందునా యువకులకు టిక్కెట్లు దక్కడంలో ప్రధాన భూమిక పోషించింది నారాలోకేషే. అటు చంద్రబాబు నుంచి ఇటు సీనియర్ల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఏ దశలోనూ రాజీ పడకుండా తను అనుకున్న వాళ్ళకు టిక్కెట్లు ఇప్పుంచుకుని గెలిపించుకున్నాడు. ఆ తరువాత మంత్రిమండలి కూర్పులోనూ తన ముద్ర స్పష్టంగా కనిపించింది. నేడు మంత్రులుగా బాధ్యత వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత, డోలా బాల వీరాంజనేయ ప్రసాద్, టీజీ.భరత్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితరులంతా లోకేష్ ఖాతాలో మంత్రులైన వారే. ఇక పార్టీలో అంత్యంత సీనియర్లు అయిన యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావ్, కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, పత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదిర సీనియర్లకు మంత్రి పదవులు దక్కపోయిన వ్యవహారం కూడా లోకేష్ ఖాతాలోనే వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక పార్టీలో తరం మారుతున్న విషయాన్ని గ్రహించిన కేయీకృష్ణమూర్తి, పూసపాటి అశోక్ గజపతి, యమన రామకృష్ణుడు రాజులాంటి నేతలు తమ వారసులను రంగంలోకి దింపేశారు. దీంతో వారికి ప్రాధాన్యత దక్కకపోయినా వారి వారసులను లోకేష్ టీమ్‌లోకి సెట్ చేసేశారు. అందుకే తాజాగా జరిగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మాకు ఎమ్మెల్సీ ఇవ్వమని పెద్దగా సీనియర్లు ఎవ్వరూ పోటీ పడలేదు. ఎందుకంటే లోకేష్ ఎలాగూ తమను కాదని పార్టీలో యువరక్తాన్ని చట్టసభల్లోకి పంపాలనే ఉద్దేశంతో ఉన్నట్లు టీడీపీలో చాలా మంది సీనియర్లకు అర్ధమైపోయింది. దీంతో అడిగి ఎందుకు కాదనిపించుకోవాలి అన్న ఆలోచనతో సీనియర్లు ఈ సారి పెద్దగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేదు. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్ధానాలు దక్కాల్సి ఉండగా ఒకటి జనసేనకి మరొకటి బీజేపీకి కేటాయించారు. ఇక మిగిలిన మూడు స్ధానాల్లో మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మను, మాజీ తెలుగు యువత అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌లను ఎంకిక చేయడం అనేది పూర్తిగా లోకేష్ నిర్ణయం అని పార్టీ వర్గాలు అంటున్నారు. అలాగే బీతిరుపతి నాయుడిని కొనసాగించడంలో కూడా లోకేష్ నిర్ణయమే అంటున్నారు. సొంత కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి సీనియర్ నేతల నంచి ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోకుండా లోకేష్ మండలిలో కూడా తన హార్డ్‌కోర్ టీమ్‌ని సెట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా గ్రీష్మ, రవిచంద్ర, బీటీనాయుడులను ఎంపిక చేసారని తెలుదేశం వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీలో పాత తరం ఒక్కొక్కరుగా తెరమరుగై పోతున్నారు. అదే సమయంలో లోకేష్ ఆలోచనలతో యువకుల రూపంలో అటు పార్టీలోను ఇటు చట్ట సభల్లోను కొత్త రక్తానికి చోటు దక్కుతోంది.