హైందవ శంఖారావ సభలో సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్
వ్యాపారాత్మక కళా… కళాత్మక వ్యాపారమైన సినిమా రంగం హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తోందని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నానని సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్ అన్నారు. కేసరపల్లి హైందవ శంఖారావంలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ హిందూ మతంపై సినీపరిశ్రమ చేస్తున్న హననాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటిదాకా చేసిన హైందవ ధర్మ వ్యక్తిత్వహననానికి సినీరంగం తరపున క్షమాపణలు చెప్పారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడిని మూడు కోణాల్లో చూడాలని అనంతశ్రీరామ్ చెప్పారు. అందులో కావ్యేతిహాసాలు, పురాణాలను వక్రీకరిచండ మొదటిది కాగా, తెరమీద కనిపించే పాత్రల్లో, పాటల్లో హైందర ధర్మాన్ని దుర్వినియోగం చెయ్యడం రెండొవదని, తెరవెనుక వ్యక్తులు హైందవ ధర్మంపై చేస్తున్న కనిపించని దాడి మూడొవదని వివరించారు. వాల్మీకి రామాయణ, వ్యాసభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయని, ఎప్పుడో వచ్చిన పాతకాలం నాటి సినిమాల నుంచి ఈమధ్య వచ్చిన కల్కి సినిమా వరకూ కర్ణుడి పాత్రకి అనవసరమైన ఉదాత్తతను ఆపాదించిడంపై నేను సినీపరిశ్రమకు చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అన్నారు. నిండు సభలో ద్రౌపదికి వలువలు వలచమని సలహా ఇచ్చిన కర్ణుడిది గొప్ప వ్యక్తత్వమని ఎలా ఒప్పుకుంటాం… గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణ మిత్రుడ్ని వదిలేసి పారిపోయిన కర్ణుడ్ని వీరుడు, శూరుడు అంటే హైందవ సమాజం ఒప్పుకుంటుందా… కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన దనస్సును పట్టిన అర్జునుడు కంటే, సూర్యడిచ్చిన దనస్సును పట్టిన కర్ణుడు గొప్పంటే ఒప్పుకుంటామా అని ప్రశ్నించారు. భారతంలోనే కాదు రామాయణంలో కూడా రాయి అడది అయినట్లు, తేలే రాళ్లతో వారధి నిర్మించినట్లు, లవకుశలు, రాముడికి యుద్దం జరిగినట్లు అనేక వక్రీకరణలు చేశారన్నారు. చిత్రీకరణకు అందంగా ఉండాలని అనేక సినిమాల్లో అభూతకల్పనలు, వక్రీకరణలు చేశారని, హరేకృష్ణ, హరేరామ్ నినాదాన్ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే భరిద్దామా అని నిలదీశారు. ఇక తెరవెనుక అన్యమతస్తులు చేసే ద్రోహం మరో ఎత్తన్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చెయ్యనన్నాడు.. నేను ఆవ్యక్తికి పదిహేను సంవత్సరాలుగా పాట రాయలేదని తెలిపారు. హిందూ ధర్మాన్ని హేళన చేసే సినిమాలను మనమే తిరస్కరించాలని సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్ పిలుపునిచ్చారు.