– ఎస్.. మీ చిట్టా నా వద్ద ఉందంటున్న రేవంత్!
– ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ రెడ్డి సర్వేలు
– ఏడాది పూర్తయిన సందర్భంగా సర్వే నివేదికలు
– 25 మంది ఎమ్మెల్యేల పనితీరుపై నెగెటివ్ రిపోర్ట్
– మంత్రుల పనితీరుపైనా సర్వేలు
– ఇద్దరు మంత్రులపై యాక్షన్‌కు రంగం సిద్ధం
– అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న రేవంత్
– ఈ నెలలోనే కీలక పరిణామాలు
ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినంతవరకు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సంస్థల ద్వారా రెగ్యులర్‌గా సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు, దానికి సంబంధించి ప్రభుత్వం గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న అంశాలపైనే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేల వరకు పనితీరు ఏ మాత్రం బాగా లేదన్న సర్వే రిపోర్ట్ లు ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ 25 మంది లిస్ట్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు అంశాలపై రేవంత్ రెడ్డి సర్వేలు చేయించినట్లుగా సమాచారం. వాటిని పరిశీలిస్తే.. ఒకటి మీ ఎమ్మెల్యే పనితీరు ఏ రకంగా ఉంది? రెండో అంశం సమస్యలు వస్తే ఎమ్మెల్యేలు ఏ రకంగా స్పందిస్తున్నారు?… మూడో అంశం ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, సదరు ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా? వంటి అంశాలపైనే ప్రధానంగా సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ 25 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి జిల్లాల నుంచి ముఖ్యంగా నాయకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూర్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, బడా వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా కొందరు నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్లు చేసి ఎమ్మెల్యేల పై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. త్వరలోనే ఈ సర్వే వివరాలను ఎమ్మెల్యేలు అందరికీ వివరించాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా భావిస్తున్నారు.
మరోవైపు.. మంత్రుల పని తీరుపై కూడా రేవంత్‌రెడ్డి దగ్గర సర్వేలకు సంబంధించిన నివేదికలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న కేబినెట్‌లో ఇద్దరు మంత్రుల పనితీరుపై ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం వచ్చిందని చెబుతున్నారు. ఈ ఇద్దరు మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండడం లేదని.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించాలన్న అభిప్రాయంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఎస్ అంటేనే ఈ విషయంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ జిల్లాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వారిపై చర్యలు తీసుకున్న విషయంలో కొన్ని సమస్యలు వస్తున్నట్లుగా తెలిసింది. సినీ నటుడు నాగార్జున విషయంలో ఒక మంత్రి వ్యవహరించిన తీరుపై అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ పదేపదే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నయి. ముఖ్యంగా మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు భూకబ్జాలకు, వివాదాలకు కేంద్రంగా ఉంటున్నారని ఆ జిల్లాకు సంబంధించిన నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకొచ్చినట్లుగా తెలిసింది. మొత్తానికి ఈ నివేదికల ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి సర్వేలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పాలన ఇమేజ్‌ను కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలన్న ఆలోచనలో ముఖ్య నేతలు ఉన్నారు. తప్పులు చేసిన వారిపై మాత్రం యాక్షన్ ఉంటుందన్న విషయాన్ని చర్యల రూపంలో చూపించాలని కొందరు అంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఈ దిశగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.