34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

మళ్లీ తెరపైకి పార్ములా ఈ కార్ రేస్ అక్రమాలు..?

పార్ములా ఈ కార్ రేస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును విచారించేందుకు ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తోంది.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నపుడు అక్రమాలు జరిగాయని ప్రభుత్వంలోని పెద్దలు మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ ఆంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా రాజ్ భవన్ నుంచి స్పందన లేదు. కేంద్రం నుంచి వచ్చే సూచనల ప్రకారం రాజ్ భవన్ కార్యచరణకు దిగే అవకాశం ఉంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంశంపై సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. గవర్నర్ అనుమతి రాకపోతే… ఏ కోణంలో విచారణ చేయొచ్చు అనే ఆంశం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తోపాటు మాజీమంత్రి కెటిఆర్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.

పార్ములా ఈ కార్ రేస్ పూర్వపరాలు

రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిధుల గోల్‌మాల్ అంశం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం జరిపిన కేటాయింపులపై ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ కోరింది. కోట్లల్లో నిధులు బదిలీలు జరగడంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎమ్‌ఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ. 55కోట్ల చెల్లింపులు జరిగాయి. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సెషన్ -10 రద్దు అయ్యింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగాయి.

కాగా.. గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్‌-9 ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.

ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్‌ ఐఏఎస్‌ ఒకరు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్‌ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్‌ రేస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్‌-10’ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్‌ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. కానీ, ఇంతలో విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఫార్ములా-ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలాఉండగా.. ఈ రేసింగ్‌లో నిధుల గోల్‌మాల్‌ అంశంపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది.

ప్రభుత్వం విచారణకు అనుమతి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా… రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా హరీష్ రావు మీద కేసు నమోదైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు కెటిఆర్ వంతు అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

కష్టాల్లో అరవింద్ కుమార్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించిన పేరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌దేనా..? మార్కెట్‌ విలువ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఓ ఐఏఎస్‌ అధికారి సూచన మేరకు నడుచుకున్నానని, ఆయనతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపానంటూ ఆ వివరాలను ఏసీబీ అధికారుల ఎదుట వివరించారు. నార్సింగిలోని కొంత వివాదాస్పద భూమికి సంబంధించి సదరు ఐఏఎస్‌ అధికారి ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చానని, ప్రతిఫలంగా స్థిరాస్తి వ్యాపారి నుంచి సదరు ఐఏఎస్‌ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారని, అందులో మొదటి విడతగా గత డిసెంబరులో కోటి రూపాయలు చెల్లించానని ఏసీబీకి శివబాలకృష్ణ వివరించినట్లు తెలిసింది.

పార్ములా ఈ కార్ రేస్, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ వ్యవహారం సదరు ఐఏఎస్ కు ఇబ్బందికరంగా మారింది. సీనియర్ అధికారి కావడం… పదవీ విరమణకు చేరువలో ఉన్న అరవింద్ కుమార్ పై ఆరోపణలు రావటం ఆయన సన్నిహితులను కలవరపరుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com