తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో కొత్తగా పలువురికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో మొత్తం 92 మంది అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమితులయ్యారు. అంతేకాకుండా.. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ ట్రాన్స్‌కోలో మరో 20 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కొత్తగా లభించాయి. వాళ్లందరికీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు.
రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ కొత్త ఉద్యోగులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టితో పాటు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరావు తదితరులు నివాళులు అర్పించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.