- చంద్రబాబు బటన్ నొక్కడు నేరుగా జేబులో వేసకుంటాడని అప్పుడే చెప్పా
- 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్సు ఇచ్చి 8 శాతం కమీషన్ తీసుకుంటున్నారు.
- స్థానిక సంస్ధల ప్రతినిధుల సమావేశంలో వైఎస్.జగన్
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని లెఫ్ట్, రైట్, సెంటర్ దోచేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన వైఎఆర్‌సీపీకి చెందిన స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్.జగన్ మాట్లాడుతూ స్థానిక సంస్ధలకు ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సందరర్భంలో వైసీపీ నేతలు తెగువ చూపించారని… వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్ధితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలు యుద్ద వాతావరణంలో జీవిస్తు్న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందన్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వేల కోట్ల రూపాయల భూములు ఇచ్చేసి నీకింతా… నాకింతా అన్న పద్దతిలో దోచుకుంటున్నారని విమర్శించారు. అమరావతిలో ఇప్పుడు వేసిన టెండర్లనే 2018లో 36వేల కోట్లకు వేశారని అప్పట్లో సిమెంట్, ఐరన్ ధరలు ఇప్పటి కన్నా ఎక్కువ ఉండేవని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు వాటి ధరలు తగ్గాయని… అయినా అవే టెండర్లను ఇప్పుడు 78వేల కోట్లకు పెంచేసి తమకు సంబంధించిన కాంట్రాక్టర్లను రింగ్ చేసి ఇచ్చేసుకుంటున్నారని వైఎస్.జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు మొబలైజేషన్ అడ్వాన్స్ ఉండేది కాదని ఎవరైనా పనిచేస్తేనే ప్రభుత్వం డబ్బు ఇచ్చేదని చంద్రబాబు వచ్చాక మొబలైజేషన్ అని కొత్తగా మొదటు పెట్టాడని అన్నారు. పది శాతం ముందుగానే కాంట్రాక్టర్లకు ఇచ్చేసి వారి నుంచి ఎనిమిది శాతం ఈయనే తీసుకుంటున్నాడని తెలిపారు. చేసిన అప్పులు అన్నీ ఎక్కడకి పోయాయి అంటే ఇలాగే పోతున్నాయని వివరించారు. జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు.. బాబు ఉంటే నేరుగా ఆయన జేబులోకి పోతాయని నేను ఎన్నికలకు ముందే చెప్పా… చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని కూడా చెప్పా… ఇప్పుడు అవి ప్లే చేసి చూస్తే జగన్ ఆ నాడు కరెక్టే చెప్పాడు మనమే మోసపోయాం అని ప్రజలందరూ అనుకుంటారని అన్నారు. ప్రతి రోజు డైవర్షనే ఓ రోజు లడ్డు అంటాడు, ఇంకో రోజు బోటు అంటాడు, మరో రోజు ఐపీఎస్ అధికారి అరెస్ట్ అంటాడు… ఆయన చేసిన లిక్కర్ స్కామ్ ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ అంటాడు ప్రతి రోజు ఏదో ఒక సన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఒక డ్రామా నడుపుతున్నారని, ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రం నడుస్తోందన్నారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే .. ఏ మంచీ చెయ్యకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదన్నారు. మళ్ళా వచ్చేది వైఎఆర్ కాంగ్రెస్ పార్టీనే… అఖండమైన మెజార్టీలో మనం తిరిగి అధికారంలోకి వస్తాం… ఈసారి అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తకు మీ జగన్న తోడుగా ఉంటాడు అని హామీ ఇచ్చారు. ఈ రోజు నాకళ్ళతో నేను చూస్తున్నా కార్యకర్త ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది ఈసారి జగన్ 2.o లో అటువంటి పరిస్ధితులు ఉండవని వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.