-
మళ్లీ మొదలవుతోన్న అమరావతి నిర్మాణం
-
ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం
-
రూ.42వేల కోట్ల విలువైన 68 ప్రాజెక్టులు
-
ఈసారైనా పనులు పూర్తవుతాయా?
-
కేంద్రం పూర్తి స్థాయి సాయం చేస్తుందా?
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలవబోతోంది. దాదాపు రూ.42 వేల కోట్ల విలువైన 68 ప్రాజెక్టులు మళ్లీ మొదలు కాబోతున్నాయి. ఈసారి నిజంగానేనా? లేక మరోసారి భారీ ఎత్తున మల్టీ కలర్ పిక్చర్ చూపిస్తున్నారా? గతంలో చంద్రబాబు పబ్లిసిటీకి పెట్టిన ఖర్చు, శ్రద్ధ రాజధాని నిర్మాణం మీద పెట్టి ఉంటే అమరావతికి ఈ దుస్థితి పట్టేది కాదు. అమరావతి నిర్మాణంలో అడుగడుగునా దొర్లిన అపశృతులు, పదనిసలు ఎన్నని చెప్పాలి?
భూ సేకరణ పెద్ద జిమ్మిక్!
అమరావతిని నభూతో నభవిష్యత్ మాదిరిగా నిర్మిస్తానంటూ టీడీపీ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి 33వేల ఎకరాలు సేకరించింది. రాజధాని కోసం భూములు త్యాగం చేయడం చిన్నవిషయం కాదంటూ రైతులను ఆకర్షించింది. బహిరంగ సభలు పెట్టి సత్కరించి సన్మాన పత్రాలు కూడా అందించింది. దాదాపు 24 వేలమంది రైతులు తమ భూములను రాజధాని కోసం త్యాగం చేశారు. కానీ, ఇవాళ్లి వరకు నగరానికి కనెక్టెడ్ ఫ్లై ఓవర్లు కూడా పూర్తి కాలేదు. అన్నీ సగం సగం నిర్మాణాలతో అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో రూపు దిద్దుకోలేదు. రాజధానిలో కనీసం డ్రై నేజ్ లైన్ల నిర్మాణాలు కూడా జరగలేదు.పెద్ద పెద్ద డ్రైనేజ్ పైప్ లైన్లు రోడ్ల పక్కన వృథాగా కనిపిస్తాయి. సింగపూర్ లాంటి అద్భుత నగరంగా రూపు దిద్దుకోవాల్సిన అమరావతి కళావిహీనంగా కనిపిస్తోంది.
సుస్థిర నగరం కాన్సెప్ట్ ఫెయిల్?
దేశంలో తొలి సుస్థిర నగరం అమరావతి అని గతంలో చెప్పింది ఫెయిల్డ్ కాన్సెప్ట్ గా మిగిలిపోయింది.చంద్రబాబు కలల రాజధాని అని చెప్పిన అమరావతి ఇప్పుడు ఆధునీకరణకు ఎదురుచూస్తోంది. ఆ సమయంలో కట్టిన సెక్రటేరియట్ కూడా గట్టిగా వర్షం పడితే నీళ్లు కారిపోతోంది. వర్షాకాలంలో ఆ ప్రాంతానికి చేరుకోవడమే గగనంగా మారింది.
తక్కువ బడ్జెట్‌తో రాజధాని నిర్మించుకోలేమా?
రాజధానిని అతి తక్కువ వ్యయంలోనే సుందరంగా, పొందికగా నిర్మించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, రాజధాని నిర్మాణం అధ్యయనం పేరుతోనే కోట్లకు కోట్లు విదేశీ పర్యటనలకు ఖర్చు చేశారు. కానీ, నిర్మాణాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
అసలు అమరావతి సరైన స్థలమేనా?
అసలు అమరావతి ప్రదేశం ఎంపికే తప్పన్నది నిపుణుల వాదన. కారణం అది అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. వేసవిలో అక్కడ ఉండటం నరకమే. ప్రతీ వేసవిలో వాతావరణ శాఖ అలర్ట్‌లు ఇక్కడ కంపల్సరీ. విభజన సమయంలో ఏపీకి రాజధాని అమరావతి అని నిర్ణయించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే.. వాస్తవానికి ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అస్సలు పనికి రాదని సర్వేలు తేల్చాయి. ఇదొక డెడ్ కేపిటల్ అనీ ఇక్కడ నిర్మాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించారు. శివరామ కృష్ణన్ కమిటీ అయితే ఇది భూకంపాల జోన్ లో ఉందని, అత్యధిక వేడి కలిగిన కొండ ప్రాంతమని తెలిపారు.
పచ్చని పంటపొలాలు ధ్వంసం
అమరావతి నిర్మాణానికి ఎంచుకున్న ప్రాంతం పూర్తిగా సారవంతమైన సస్యశ్యామలమైన ప్రాంతం. ఏడాదికి మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతం. అరటి, శెనగ, పెసలు, మినుములు.. కూరగాయలు చెరకు తోటలు ఇలా ఒకటి కాదు. అన్ని రకాల పంటల సాగుకు అత్యంత అనుకూలమైనది. ఇక్కడ రాజధాని నిర్మాణం అంటే పచ్చని పంటలను నాశనం చేయడమేనని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది.. పైగా కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చట్ట విరుద్ధమని, అది వాల్టా చట్టాన్ని వ్యతిరేకించడమేననే వాదనలు కూడా వినిపించాయి. ఎంతమంది మొత్తుకున్నా.. చంద్రబాబు ప్రపంచ రాజధానులను తలపించే అత్యద్భుతమైన, నగర నిర్మాణం చేస్తామని చెబుతూ వచ్చారు. రాజమౌళి, బోయపాటి లాంటి స్టార్ డైరక్టర్ల తో చర్చలు జరిపి పలు నమూనాలపై చర్చలు జరిపారు. కానీ, అప్పటి టీడీపీ ఐదేళ్ల పాలనలో రాజధాని పేరుని కనీసం సేలబుల్ చేయలేకపోయారు. కమర్షియల్ వాల్యూ కూడా అద్దలేకపోయారు.
చెప్పిందేంటి? చేసిందేంటి?
ఇక ఏపీ అసెంబ్లీ భవనం స్టాట్యూ ఆప్ యూనిటీ కన్నా మించి ప్రపంచంలో అతి ఎత్తైనదిగా నిర్మిస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడున్నది మాత్రం ఎడారిలో అట్ట సెట్టింగ్‌లా కనిపిస్తుంది. చుట్టు పక్కల ఎలాంటి నిర్మాణాలు లేవు. పైగా లెజిస్లేటివ్ భవనం నాలుగు అంతస్థులతో కడతామని చెప్పి ఒకే అంతస్థుకు పరిమితం చేశారు.
వాస్తవానికి అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లా నిర్మిస్తామన్నది టీడీపీ ప్రభుత్వం చెప్పిన మాట. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే అంతకుముందు ఏ నిర్మాణమూ, అభివృద్ధీ జరగని ప్రాంతంలో తొలిసారి నగర నిర్మాణం ఉండబోతోందని. అమరావతి రెండు అర్బన్ సెంటర్లు… అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్య ఉంటుంది. అడుగడుగునా పంట చేలతో పచ్చని తోరణంలా కనిపిస్తుంది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన నేలలున్న ప్రదేశం. నిజానికి ఇలాంటి చోట భూ సేకరణ అంటే రణరంగమే. ఉద్యమాలే జరుగుతాయి. కానీ రైతులందరూ ఎలాంటి వ్యతిరేకత లేకుండానే రాజధాని కోసం పొలాలను ఇచ్చేశారు. 20 గ్రామాల రైతులు మొత్తం 28 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూమి వైశాల్యం చండీగఢ్ అంత విశాలమైన ప్రాంతం. ఇంత పెద్ద భూ సేకరణ మన దేశంలో మునుపెన్నడూ జరగలేదు. పంటలన్నింటినీ బుల్డోజర్లతో ధ్వంసం చేయడానికే ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. రైతులకు మహర్దశ పడుతుందని,పెద్ద పెద్ద కాలనీలు నిర్మిస్తామని, ఇంటికో ఉద్యోగం గ్యారంటీ అనీ ఆ సమయంలో ప్రకటించారు.
మోదీ మాటల కోట!
తొలిసారి అమరావతి పనుల శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటు నుంచి పిడికెడు మట్టి, యమునా నది నుంచి ముంతడు నీళ్లు తెచ్చి గిఫ్టుగా ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం దేశ రాజధానే తరలి వచ్చిందంటూ హడావుడి చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, యువత అందరూ ఉద్యోగాలు పొందుతారని, నిరుద్యోగం రూపు మాసిపోతుందని మోడీ,చంద్రబాబు ప్రసంగాల్లో ప్రస్ఫుటించారు. అన్ని భవనాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటవుతాయని, తొలి సోలార్ పవర్ కేపిటల్ అమరావతి అంటూ ప్రకటించారు. నగరం మధ్యనుంచి ప్రవహిస్తున్న కృష్ణా నదిని సైతం రవాణాకు వినియోగిస్తామని, లండన్ లో థేమ్స్ నదితో పోలుస్తూ పదేపదే ప్రకటనలు చేశారు. ఆంధ్రుడు కలలో సైతం ఊహించలేనంత రేంజ్‌కి అమరావతి నగరం వెళ్లిపోతుందని, రవాణాకు వాటర్ టాక్సీలు కూడా ప్రవేశపెడతామని సైతం చెప్పారు. అమరావతి ఏకంగా ఐదు లేన్ల రోడ్లతో కనెక్ట్ అవుతుందని, కేవలం పాదచారులకు ఒకటి, ప్రజా రవాణాకు ఒకటి, ఆపై కేవలం సైకిళ్లు తిరగడానికి ఒక మార్గం నిర్మిస్తామని ప్రతిపాదనలు చేశారు.
9 జిల్లాల సమాహారమా?
రాజధాని నగరాన్ని9 జిల్లాల సమాహారంగా చేస్తామని, 9 విభాగాలకు వేర్వేరు జిల్లాలు ఉంటాయని ప్రతిపాదించారు. క్రీడలకు, ఆరోగ్య రక్షణకు ఇలా 9 జిల్లాలు ఉంటాయని అమరావతి ప్లానింగ్ లో చూపించారు. అంతేనా? అమరావతి నగరలో అండర్ గ్రౌండ్ భవంతులు కూడా నిర్మిస్తామన్నారు. వీటి నిర్మాణాలు భారీ వ్యయంతో కూడుకున్నవే. సింగపూర్ ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వంతో కలసి ఈ నగర నిర్మాణం చేస్తామని ముందుకొచ్చింది.
నిధులెక్కడినుంచి?
రాజధాని కోసం నిధుల సేకరణ కూడా అట్టహాసంగానే మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ముంబై స్టాక్ మార్కెట్ వరకూ ప్రతీది ఎక్కే గుమ్మం. దిగే గుమ్మం.. ప్రపంచ బ్యాంకు, ఆసియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్యాంక్, లూలూ గ్రూప్ లాంటి ఇన్వెస్టర్లు కూడా వచ్చారు. 2015 సమయంలో అమరావతి సిటీ ప్లానింగ్ నిర్మాణం బ్లూ ప్రింట్ రిలీజ్ అయ్యింది. 2024 కల్లా ప్రజా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ప్రకటించారు. కానీ, తొలి ఐదేళ్లలో జరగాల్సినంత పురోగతి నిర్మాణాల్లో కనిపించలేదు. 33వేల ఎకరాలు సేకరించి అక్కడొకటి, అక్కడొక నిర్మాణాలతో సరిపెట్టారు.
అంచనాలు తారుమారు
2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఓటమి పాలైంది. 175 సీట్లకు గాను 2014లో 117 సీట్ల మెజారిటీతో గెలిచిన చంద్రబాబు 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమయ్యారు. వైసీపీ 151 సీట్లు గెలిచి రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, అమరావతి నిర్మాణం మాత్రం కుప్పకూలింది. రాజధాని నిర్మాణం పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలు టీడీపీని వెంటాడాయి. అప్పటికే కొన్ని వేల కోట్లు ఖర్చయినా.. ఆశించినంత మేర నిర్మాణాలు పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం విదిల్చే అరకొర సాయంతో ఇంకా పునాదులైనా పడని రాజధాని నిర్మాణం అయ్యే పని కాదని.. వైఎస్ జగన్ అసలు రాజధాని నిర్మాణం ఊసే ఎత్తలేదు. అమరావతి ప్రాజెక్టులన్నీ రద్దు చేశారు.
స్టాండ్ మార్చిన జగన్
చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదన చేసినప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పి ఉంటే దాని వాదానికో అర్ధం ఉండేది. కానీ, ఆరోజు అమరావతిపై తీర్మానానికి మద్దతు తెలిపిన జగన్.. అధికారంలోకి రాగానే అమరావతి ఒక డెడ్ కేపిటల్ అని ప్రకటించారు. అమరావతి చుట్టుపక్కల తన సొంత సామాజిక వర్గం లబ్దిపొందేలా చంద్రబాబు ప్రభుత్వం భూముల అమ్మకాలు జరిపిందన్నది వైసీపీ వాదన. పైగా అమరావతి నిర్మాణం పునాదులతో సహా మొదలు పెట్టాలి. ఇక్కడ రాజధాని నిర్మాణానికి రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని, పైగా నిర్మాణాలకే పదేళ్లకు పైగా పడుతుందని, అందులో సగం ఖర్చుతోనే విశాఖ పట్నం లాంటి నగరం అద్భుతంగా రాజధానిగా మారుతుందని వైసీపీ ప్రకటించింది. జగన్ హయాంలో అమరావతిలో ఇటుక కూడా కదలలేదు. అయితే, విశాఖ రాజధానిగా చేస్తామన్న జగన్‌కి అడ్డుపడింది టీడీపీ.
తెరపైకి మూడు రాజధానులు
ఓ వైపు ఎన్నికై రెండున్నరేళ్లు కావస్తున్నా రాజధాని నిర్మాణం జరగకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతో జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తెచ్చారు. దక్షిణ ఆఫ్రికాలో మూడు రాజధానులున్నట్లే మనకూ మూడు రాజధానులు ఉండటంలో తప్పులేదని, శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర ప్రాంతమైన విశాఖ ఉంటుందని, న్యాయ రాజధాని కర్నూల్ అని ప్రకటించారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. విశాఖ తీరాన రుషికొండపై పెద్ద పెద్ద భవనాలే నిర్మించారు. అయితే, మూడు రాజధానుల మధ్య లాజిస్టిక్స్ సమస్య, సమన్వయం గురించి వైసీపీ ఆలోచించలేదు. విశాఖ నుంచి న్యాయ రాజధాని కర్నూల్‌కి వెళ్లాలంటే దాదాపు వంద కిలోమీటర్ల దూరం.
ఐదేళ్లు పూర్తయి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయింది. ఒక రాజధాని నిర్మాణానికే డబ్బు లేక అల్లాడుతున్న ఏపీకి మూడు రాజధానుల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా? దానికోసం భూ సేకరణ ఎంత కష్టం? అంత సొమ్ము కూడా రాష్ట్రం దగ్గర లేదు. కేంద్రమా విదిలించదు. పైగా ఏపీ అప్పటికే మూడు లక్షల కోట్ల అప్పులో ఉంది. దేశంలో పది దివాలా తీసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ప్రభుత్వోద్యోగులకు జీతాలే ఇచ్చే పరిస్థితి లేదు. ఇక భూ సేకరణకు డబ్బు ఎక్కడ?
ప్రస్తుత పరిస్థితి
అత్యద్భుతంగా రాజధాని నిర్మిస్తామన్న టీడీపీ హయాంలో హై కోర్టు నిర్మాణం అసంపూర్ణంగానే ఆగింది. రాజధానిలో హెలిపాడ్ సౌకర్యం అన్నారు. కానీ, ప్రస్తుతం ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటేనే గంటకు పైగా సమయం పట్టేలా ఉంది. ప్రభుత్వాధికారుల కోసం అంటూ 44 అంతస్థులవి నాలుగు భవనాలు కట్టారు. కానీ, అవన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి దరిద్రంగా తయారయ్యాయి.వాస్తవానికి మంగళగిరి, గుంటూరు మధ్య చెన్నై హైవేకి ఆనుకుని ప్రభుత్వ భవనాలు కట్టి ఉంటే, రాజధాని మార్చే ధైర్యం ఎవరూ చేసి ఉండేవారు కాదు. ఇది టీడీపీ చేసిన చరిత్రాత్మక తప్పిదం. పైగా ఇప్పుడు మళ్లీ మరో 40 వేల ఎకరాలు సేకరించాలనుకోవడం మరో దిద్దుకోలేని తప్పు. ఇది రాజధాని నిర్మాణమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అనే డౌట్స్ పెంచుతోంది. ఇప్పటికే 30వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదు.రెండు పార్టీల మధ్య నలిగిన ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయింది.
మరి.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపులో కాస్త సానుకూలంగా ఉంది. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ కూటమే ఏపీలో కూడా అధికారంలో ఉంది. ఈ పరిణామం కాస్త మెరుగ్గా అనిపిస్తున్నా.. అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం…