జపాన్ తెలుగు సమాఖ్యకు సీయం రేవంత్ రెడ్డి పిలుపు
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని అక్కడి తెలుగు సమాఖ్య సన్మానించింది. ఈ సందర్భంగా జపాన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలనుద్దేశించి సీయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలలో సాధించాల్సిన ప్రగతి సాధించేశామని అన్నారు. అలాగే డ్రైపోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని ప్రకటించారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్ లో కూడా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. నీరు మన సంస్కృతని, అభివృద్ధికి ప్రతీక అని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే కొంత మంది అడ్డుపడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అన్ని సంస్ధలకు సెలవులు ఇస్తున్న పరిస్ధితి ఉందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్తంభించే పరిస్ధితి ఉంటే దాన్నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలా లేదా అని సీయం ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెపుతున్నా అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని సీయం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా జపాన్ తెలుగు ప్రజలకు సీయం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చన్నారు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని సీయం రేవంత్ రెడ్డి జపాన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.