మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి సమయం సమీపిస్తోంది. పదవ తేదీ సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. ఎయిర్‌పోర్టు నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ నగరమంతా విదేశీయులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఈ ఏర్పాట్లు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కి చేరుకున్నారు. మిగిలిన దేశాల నుంచి పోటీదారులు కూడా రెండు రోజుల్లో రాబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. మిస్ వరల్డ్ సంస్థ తరఫున 28 మంది నిర్వాహకులు, 17 మంది సహాయక సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరికీ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్వాగతం పలకడంతో పాటు.. బస ఏర్పాట్లు టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఇక, దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద ప్రత్యేక భద్రత కల్పించారు.
మరోవైపు.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవాళ్లు.. రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు. వారిని చిన్న చిన్న గ్రూపులుగా విభజించి, పాల్గొనబోయే కార్యక్రమాలపై నిర్వాహకులు వివరాలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ కంటెస్టంట్లు తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం, మహిళల కోసం అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణపై ప్రచారం చేయడం లాంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగమవుతున్నారు. ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు సమీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదంతో రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను దేశవిదేశాల్లో ప్రచారం చేసేందుకు అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగనున్న ఈ వేడుకల్లో సాధారణ పౌరులకు కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించనున్నారు. టూరిజం శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకున్న ఐదువేల మంది ప్రేక్షకులకు, హైదరాబాద్‌లోని ఐదు కేంద్రాల్లో, వేయి మందికి చొప్పున పోటీలు వీక్షించే అవకాశాన్ని అందించనున్నారు.