బాలీవుడ్లో ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్‌కు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఈ పేరును రిజిస్టర్ చేసేందుకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు దరఖాస్తు చేశాయని సమాచారం. ఈ జాబితాలో టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ టైటిల్ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిన నిర్మాతల్లో ఒకరైన అకోశ్ పండిట్ మాట్లాడుతూ, సినిమా ఇప్పుడే నిర్మిస్తామా, లేదా అన్నదాన్ని చెప్పలేమని, కానీ ఇది అత్యంత ప్రభావవంతమైన పేరు కావడంతో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఒక మంచి పేరు లేకుండా సినిమా ప్రారంభించలేమని ఆయన పేర్కొన్నారు. తనకు దేశంలోని పరిస్థితులపై అవగాహన ఉందని, గత 35 ఏళ్లుగా బాధితుడిగా జీవిస్తున్నానని, పాకిస్థాన్ వల్ల వచ్చిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ పేరు చాలా కీలకమైందని తెలిపారు. ఈ టైటిల్ కోసం మొదటగా దరఖాస్తు చేసిన సంస్థ మహవీర్ జైన్ ఫిల్మ్స్ కాగా, కొన్ని సంస్థలు తమ దరఖాస్తులను తిరిగి తీసుకున్నాయి. జియో స్టూడియోస్ ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, అది యాజమాన్యానికి తెలియకుండా జరిగిందని జీ సంస్థ తెలియజేసింది. ఆ పేరు వినియోగించాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై జరిపిన ప్రతీకార దాడులు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారతీయ సంప్రదాయంలో సిందూరం ఒక వివాహిత స్త్రీకి గౌరవ చిహ్నం. అలాంటి చిహ్నాన్ని దూరం చేసిన వారికి తగిన జవాబు ఇవ్వడమే ఈ ఆపరేషన్ లక్ష్యంగా నిలిచింది. అందుకే సెంటిమెంట్‌తో పాటు.. ఎమోషన్స్ కలగలసిన ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ఈ స్థాయిలో పోటీ నెలకొంది.
- Advertisement with us -