సునామీకి రెండు దశాబ్దాలు…
ప్రకృతి పగ పడితే.. అంతా వినాశనమే.. 20 ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో వచ్చిన ఓ భూ కంపం ఆపై సునామీకి కారణమైంది.. కడలి కల్లోలమైంది. తీర ప్రాంతాన్ని కోలుకోలేనంత దారుణంగా దెబ్బ తీసింది. అవును… ఓ ఘోర సునామీ రెండు దశాబ్దాల క్రితం దక్షిణ భారతాన్ని అత్యంత దారుణంగా కబళించింది. సరిగా 2004 డిసెంబర్ 26 అంటే ఇదే రోజున ఆ ఘోర విపత్తు జరిగింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కూడా .. తుఫాను ఛాయలు.. దక్షిణ కోస్తా, చెన్నైలలో విస్తారంగా వర్షాలు.. అన్నీ ఆ ఘోరాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నాయి.
ఆరోజు ఏం జరిగిందంటే..
ప్రపంచం క్రిస్మస్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్న తర్వాత రోజు ఎప్పటిలాగే తెల్లారింది. కానీ హఠాత్తుగా తీర ప్రాంతాల్లో ఓ చిన్న అలజడి.. పైకి తెలియదు.. హటాత్తుగా కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరప్రాంతాల ఇళ్లను ముంచెత్తాయి. ఊహించని ఈపరిణామానికి జనంలో కంగారు మొదలైంది. మొదట తెలిసిన వార్త సముద్రం పొంగుతోందని.. ఊర్ల మీద పడిపోతోందని తీరం జనాల్లో ఓ చిన్న ఉలికి పాటు.. అంతలోనే చిన్నపాటి వర్షం..పెనుగాలులు లేకుండా ఉప్పెన ఏమిటని అందరూ సందేహంలో పడ్డారు. జరుగుతున్నదేమిటో ఎవరికి అర్ధం కావడం లేదు. ఊహించని ఉపద్రవమేదో ముంచుకొస్తోందనే సంకేతాలు మాత్రం వెలువడ్డాయి. అప్పటి వరకూ ఉప్పెననే చూసిన అనుభవం చాలా మందిది. వాతావరణంలో మార్పులు మామూలే అనుకున్నారు అవి ఓ పెను ప్రమాదానికి సంకేతాలని పసిగట్టలేకపోయారు. బందరు తీర ప్రాంతంలో సముద్రం చాలా ముందుకు వచ్చేసింది. దాని స్పీడు చూస్తుంటే బందరు పట్టణాన్ని ముంచేస్తుందా అన్న భయం కలిగింది. క్రమంగా పట్టణాన్ని సముద్రం మింగేయబోతోందన్న వదంతులు వినిపించాయి. అంతే అక్కడి జనం మూటాముల్లె తీసుకుని పరుగులు.. కొందరు హైదరాబాద్ కు వెళిపోతే బెటర్ అనుకున్న సందర్భం.. మధ్యాహ్నానికల్లా సముద్రంలో బడబానలం రేగిందన్న వార్తలు థ్రువపడ్డాయి. సముద్ర గర్భంలో భూమాతకు కోపం వచ్చింది.. సునామీ రూపంలో అది మనందరినీ వెంటాడింది. అంతే సముద్రం విషపు కోరల్లో పట్టణాలకు పట్టణాలే కొట్టుకుపోయాయి. తమిళనాడు రూపు రేఖలు లేకుండా పోయింది. నాగపట్నాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది. కొంపా గోడు, ఆస్తులు, ఇళ్లు, పొలాలు, ఆఫీసులు, రోడ్లు అన్నింటినీ కడలి కెరటాలు అనకొండలా మింగేశాయి. ఏపీలో తీర ప్రాంతాలన్నీ ఈ దాడి గుప్పిట చిక్కాయి. అప్పటికే శవాల గుట్టలు.. ఎక్కడికక్కడ మృత దేహాలు.. శోకాండాలు.. కళ్ల ముందే కొందరిని సముద్రుడు మింగేస్తే.. కాస్త భూమ్మీద నూకలుండి కాళ్లకు పనిచెప్పిన వారు అక్కడక్కడా మిగిలారు.. పోయిన వారికోసం గుండెలవిసేలా ఏడవలేరు.. ఎటు వెళ్లాలో తెలీదు.. అసలు ఏం జరుగుతోందో తెలియదు.. అందరికీ మైండ్ బ్లాంక్..
విషాదాన్నినింపిన మంగినపూడి బీచ్
26 వ తేదీ ఆదివారం కావడంతో టూరిస్ట్ బస్సులలో బందరు మంగినిపూడి బీచ్ కు ఉదయం 8 గంటలకే విహారయాత్రకు వచ్చారు కొందరు. సాధారణంగా బందరు మంగినిపూడి బీచ్ కు పర్యాటకులు ఉదయం 11 గంటల క్రమేపి పెరుగుతుంటారు. అక్కడకు వచ్చిన టూరిస్టులను సునామీ మింగేసింది. దాదాపు 26 మంది అకాల మృత్యువాత పడ్డారు. అదే సునామి మధ్యాహ్నమో..సాయంత్రమో వచ్చి ఉంటే ఇంకా ప్రాణ నష్టం అధికంగా ఉండేది.
ఇండోనేషియాలో పుట్టి…
ఆదివారం తెల్లవారు జామున ఇండోనేషియాలో సుమత్రా దీవుల పశ్చిమ తీరంలో సముద్ర గర్భంలో రేగిన భూకంపాల పరంపర సునామి రూపంలో మొత్తం హిందూ మహాసముద్ర తీర దేశాలన్నింటిని కదిలించివేసింది. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్ లాండ్ మరియు సోమాలియాలతో సహా మొత్తం 14 దేశాలలో సుమారు 2,30,000 మందిని సునామి పొట్టన పెట్టుకుంది. సుమారు 30 కిలోమీటర్లు లోతులో సముద్రంలో సంభవించిన భూకంప పరిణామాలు సముద్ర కెరటాలు 30 అడుగుల ఎత్తున ఎగిరేటట్లు చేశాయి. తద్వారా తీర ప్రాంతాలు అన్ని నేలమట్టం అయ్యాయి.
రిక్టర్ స్కేల్ లో ప్రమాదకర స్థాయిలు..
ఆ భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై అప్పట్లో 9 .1 గా నమోదైయ్యాయి. భూప్రకంపనలు 8.3 నుండి 10 నిమిషాలు వరకు కొనసాగాయి. ఇటువంటి భూకంప తీవ్రతకు భూగోళం అంతా 1 నిముషం పాటు కంపించిపోయింది. అలస్కా వంటి దూర ప్రాంతంలో, మన దేశంలో తమిళనాడు తీర ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ మరియు మయన్మార్ వంటి దేశాల్లో కూడా జరిగిన అపార నష్టంను అంచనా వేయడం అప్పట్లో కష్టమైపోయింది. మన దేశంలో ఏడు చోట్ల అప్పట్లో సముద్రం పోటెత్తింది. ఆగ్నేయ మరియు దక్షిణాసియా దేశాలలో ప్రజలు హాహాకారాలు చేశారు. మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో మృత్యు తాండవం జరిగింది. దాదాపు 13 వేలమంది ఘోర మరణం పాలయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అణుబాంబు కంటే ప్రమాదం..
ఇది జపాన్లో హిరోషిమాపై అణుబాంబు ప్రమాదం కంటే దాదాపు 1500 రెట్లు అధికమని అప్పట్లోనే నిపుణులు అంచనా వేశారు. అయితే అప్పట్లో జరిగిన సునామీని ముందుగా గుర్తించలేక పోవడమనేది ప్రధాన లోపం ఎందుకంటే ఇండోనేషియా తీరంలో సంభవించిన తొలి భూకంపానికి, సునామి ఉత్పాతానికి మధ్య చాల గంటల వ్యవధి ఉన్నా ఈ కల్లోలం మన దేశ తీరాన్ని దెబ్బ తీసే వరకూ ఎవరు పసిగట్టలేదు. హిందూ మహాసముద్రంలో ఈ ముప్పును గుర్తించే మరియు హెచ్చరించే యంత్రాంగం మరియు వ్యవస్థ లేవీ లేక పోవడం వల్ల సునామిని గుర్తించలేకపోయారు..నిజానికి సునామిని గుర్తించాలంటే అంత సులభం కాదు.
2004 నాటికి అమెరికా సునామీని గుర్తించ గల్గినా ఏ దేశానికి ఆ విషయాన్ని తెలియజేయాలో తమకు తెలియకపోవటం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయింది. దీని వల్ల ఐక్యరాజ్యసమితి “హిందూ మహా సముద్ర సునామి హెచ్చరికల యంత్రాంగం” ని నెలకొల్పేందుకు గట్టిగా కృషి చేసింది. 2006 నాటికి ఇది ఒక రూపాన్ని సంతరించుకొని, యునెస్కో సారథ్యంలో 25 సిస్మోగ్రాఫిక్ వీశాట్ కేంద్రాల అనుసంధానంగా 26 దేశాలలో జాతీయ సునామీ కేంద్రాలకు సమర్ధవంతంగా సమాచారం అందించే విధంగా యంత్రాంగం రూపుదిద్దుకొంది. పసిఫిక్ మహా సముద్రంలో “పసిఫిక్ సునామి వార్నింగ్ సెంటర్” ను నెలకొల్పారు. .
ముందస్తు హెచ్చరికలు సాధ్యమేనా?
సునామీల విషయంలో సులువైన అంశమేమిటంటే వీటిని ముందుగా పసిగడితే ముందస్తు సురక్షిత చర్యలు తీసుకొనేందుకు కొంత సమయం ఉంటుంది. 2004 సునామి అనంతరం శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అయ్యాయి. దీనిలో భాగంగా సునామి ఆనవాళ్ళను గుర్తించే సెన్సార్ నెట్వర్క్, అంతర్జాతీయంగా శాటిలైట్ తో నిరంతరం నిఘా, సరియైన సమయంలో వాటిని విశ్లేషించే నిపుణుల బృందం, తదనుగుణంగా సునామి హెచ్చరికలు జారీ చేసే యంత్రాంగం, స్పందించే బృందాలు అప్పటితో పోలిస్తే ఇపుడు సర్వసన్నద్దంగా ఉన్నాయి.