మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గల సిఎంఆర్ కళాశాల బాలికల వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. బాలికల వసతి గృహం లో కొందరు బాత్రూంలో బాలికలు ఉన్న సమయంలో వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో ఎన్.ఎస్.యు.ఐ, ఎస్ ఎఫ్ ఐ, ఏబివిపి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సిఎంఆర్ ఐటి కళాశాల బాలికల వసతి గృహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వసతిగృహంకు వచ్చి బాలికల ఆరోపణల మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో బాలికలకు రక్షణ లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
సీఎంఆర్ విద్యాసంస్థల్లో విద్యను వ్యాపారం చేస్తున్నారని వసతి గృహాల్లో ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజులపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సిఎంఆర్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థినులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోపణ మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న నంద కిషోర్ యాదవ్, గోవింద కుమార్, సురేష్, రాకేష్ రావత్, గణేష్ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 12 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. వసతిగృహం సెక్యూరిటీ గార్డ్ గదిని భారీగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు ధ్వంసం చేశారు. విద్యార్థినులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్న యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.