మరో తెలుగు తేజానికి అమెరికాలో కీలక పదవి దక్కింది. డెలావేర్ రాష్ట్ర 81వ విదేశాంగ కార్యదర్శిగా చారుణి పాటిబండ సాంచెజ్‌ను డెలావేర్ రాష్ట్ర సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. హైదరాబాద్ ఈసీఐఎల్ వ్యవస్ధాపకుడైన డాక్టర్ ఏఎస్‌రావు మనవరాలే చారుణి పాటిబండ. ఆమె తండ్రి శర్మ పాటిబండ డెలావేర్ హిందూ టెంపుల్ (మహలక్ష్మీ దేవాలయం) నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. శర్మ పాటిబండ సమాజానికి చేసిన విశిష్ట సేవకు గాను ఫిలడెల్ఫియాలో జరిగిన23వ తానా కాన్ఫరెన్స్ లో అవార్డుతో సత్కరించారు. డెలావేర్‌కు చెందిన చారుణి పాటిబండ సాంచెజ్ దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. అలాగే ఎమోరీ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి జ్యూరిస్ డాక్టరేట్ పొందారు. డెలావేర్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత వైవిద్యమైన విదేశాంగ విభాగానికి కార్యదర్శిగా చారుణి పాటిబండ ఎంపికవ్వడం అమెరికా తెలుగు కమ్యూనిటీకి గర్వకారణం అంటున్నారు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లురి రవి.