31.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

అభివృద్ధిలో తెలంగాణ పరుగులు – పంచాంగ శ్రవణంలో పండితులు

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడుతుందని వేద పండితులు స్పష్టం చేశారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులు సంతోష్‌ కుమార్‌ శాస్త్రి.. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పరుగులుపెట్టి పాలిస్తారని, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారన్నారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయని, ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారని పంచాంగ శ్రవణంలో చెప్పారు.

అప్పుడప్పుడు తుపాన్లు, భూకంపాలు పలకరించే అవకాశం ఉంటుందని, ఆర్థిక భారం కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ యేడాది ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటారని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బు రాకపోవడంతో కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో ఇబ్బందులు వస్తాయని, వాటిని ముఖ్యమంత్రి అధిగమిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. విద్య, వైద్యంపై ఎక్కువగా దృష్టి పెడుతుందని చెప్పారు. సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అనుకోని ఇబ్బందుల వల్ల అన్ని కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చని, పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజాధనాన్ని వెచ్చిస్తారన్నారు. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా తెచ్చే ప్రయత్నం చేస్తారని, రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తారని సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com