- డిప్యూటీ సీఎం భట్టి మనోగతం వెల్లడి
- సూపర్ సిక్స్ కన్నా ఎక్కువే చేశాం
- తెలంగాణ అభివృద్ధి పథం రాహుల్ రచన
- లౌకికవాదం, జాతీయత మా విధానం
- రేవంత్ నాయకత్వం బాగుంది
- కులగణన చేసింది మేమే.. త్వరలో డాటా విశ్లేషణ
- రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి
- ప్రపంచ కంపెనీలకు తెలంగాణ అల్టిమేట్ డెస్టినేషన్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నకాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఒక అభివృద్ధి నమూనాగా మారుతున్నాయి. ఇవి ఆర్ధిక అభివృద్ధికి, సామాజిక సమ్మిళిత్వానికి చేదోడు,వాదోడుగా అడుగులేస్తున్నాయని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. మూడో సారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గడచిన పదిహేను నెలల పాలనానుభవాన్ని భాస్కర న్యూస్‌తో పంచుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
భాస్కర న్యూస్ : తెలంగాణ విజన్ అంటే ఏంటి…?
డీవైసీయం భట్టి విక్రమార్క : రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి స్పూర్తి పొంది సామాజిక న్యాయం, లౌకిక తత్వం, సమ్మిళిత అభివృద్ధి అనే మూడు అంశాలను రంగరించి తెలంగాణ విజన్ రూపొందించాం. బిజెపి విజన్‌ప్రత్యామ్నాయంగా జాతీయ వాదం, లౌకికవాదంతో కాంగ్రెస్ అడుగులేస్తోంది.అదే తెలంగాణ అభివృద్ధికి మూలం. ఈ విజన్‌ముందుకు తీసుకువెళ్లడానికి మాకు ప్రజలు ఇచ్చిన తోడ్పాటు, తీర్పే మచ్చుతునక.
భాస్కర న్యూస్ : ఈ పదిహేను నెలల్లో మీరు ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారు…?
డీవైసీయం భట్టి విక్రమార్క : రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖను నాకు అప్పగించారు. 2023 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించాం. వ్యవసాయం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రచించిన ఈ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఒకటి. అలాగే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశాం. రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం. అయితే, చేసిన వాగ్దానాలకన్నా ఎక్కువే అమలు చేస్తున్నామని చెప్పగలను. విద్యారంగం, రైతు, మహిళా, గిరిజన సంక్షేమం విషయంలో విప్లవాత్మక పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం. సమ్మిళిత అభివృద్ధి పథానికి తోడు సీఎం రేవంత్ సారథ్యంలో పూర్తి సామరస్య పూరిత వాతావరణంలో ప్రభుత్వం నడుస్తోంది.
భాస్కర న్యూస్ : ఆరు గ్యారెంటీలకి మించి చేశామని చెపుతున్నారు… ఏంటవి…?
డీవైసీయం భట్టి విక్రమార్క : మార్చి 19వ తేదీన అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్‌లో మరిన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించాం. అవి ఆర్థిక పురోగతితో పాటు, మహిళలు, ఆదివాసీలకు క్షేత్ర స్థాయిలో ఆర్థిక చైతన్యాన్ని కలిగించేవి. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్మాణానికి ఈ సారి బడ్జెట్‌లో రికార్డు స్ధాయిలో రూ.11,600 కోట్లు కేటాయించాం. విద్యార్థులే రేపటి తెలంగాణ భవిష్యత్తుగా మా ప్రభుత్వం చూస్తోంది. అందుకే విద్య మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈపథకం కింద ప్రతీ స్కూలు కోసం రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నాం. ఇందులో కనీసం 58 స్కూళ్ల నిర్మాణం ఈఏడాది పూర్తి చేయాలని నిర్ణయించాం. ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలోనూ ఇలాంటి స్కూలు ఒకటి అందుబాటులో ఉండేలాగా, అన్ని సామాజిక వర్గాలకు చెందిన పిల్లలందరికీ ఈ స్కూలులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన చదువును అందించాలనేది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 25 ఎకరాల భూమిలో ఒక్కో స్కూలు నిర్మాణం జరుగుతుంది. ఈ స్కూళ్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన, క్రీడా సౌకర్యాలు ఉంటాయి. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన పిల్లలకు మరిన్ని మెరుగైన అవకాశాలు అందించడమే మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం.
భాస్కర న్యూస్ : మీరు చేసిన కుల గణన వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది…?
డీవైసీయం భట్టి విక్రమార్క : మేము చేసిన కులగణన చారిత్రాత్మకమైనది. దేశానికే ఈ కుల గణన దిక్సూచిలా పనిచేస్తుంది. మా నేత రాహుల్ గాంధీ కూడా ఈ కులగణనపై చాలా ఆసక్తిగా ఉన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి కుల గణన చేయాలనే సంకల్పం పార్టీకి కల్పించడంలో తెలంగాణలో చేసిన కులగణన దోహదపడిందని చెప్పడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా క్యాబినెట్ సహచరులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అందరూ గర్వపడే సందర్భం. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే కులగణన ద్వారా సేకరించిన డేటా ఆధారంగా అణగారిన వర్గాల వారికి మరింత మేలు చేసే విధంగా భవిష్యత్తులో సంక్షేమ పథకాల కేటాయింపులు ఉంటాయి. దామాషా ప్రకారం రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కడమే కాకుండా నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పితే భవిష్యత్తులో ఎవరైనా దీన్ని ఫాలో కావాల్సిందే.
భాస్కర న్యూస్ : దీనివల్ల షెడ్యూల్డ్ కులాలకు ఎలా న్యాయం జరుగుతుంది…?
డీవైసీయం భట్టి విక్రమార్క : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడానికి మేము చేసిన కులగణన దోహద పడుతుంది. పకడ్బందీగా సబ్ ప్లాన్ అమలు చేసి తీరతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసింది. మేము ఈ సారి బడ్జెట్‌లో ఎస్సీలకు 40వేల 232కోట్లు, ఎస్టీలకు 17వేల 169కోట్లు కేటాయించడానికి కులగణనే ప్రాతిపదిక.
భాస్కర న్యూస్ : తెలంగాణలో ఇంకా చాలా ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ఆధారిత వ్యవసాయమే కొనసాగుతోంది… రైతులకు మీ ప్రభుత్వం చేసే మేలు ఏంటి…?
డీవైసీయం భట్టి విక్రమార్క : గడచిన పదేళ్లు సాగునీటి పేరుతో లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినట్లు చూపించి వేల కోట్లు దోచేశారు. కానీ, తెలంగాణలో రైతులకు కావలసిన సాగునీరు మాత్రం అందించలేకపోయారు. మేము నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తూనే ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో 2లక్షల పైచిలుకు గిరిజన రైతులకు సోలార్‌తో నడిచే వ్యవసాయ పరికరాలను ఉచితంగా ఇవ్వనున్నాం. ఈ ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదిక అమలు చేసేందుకు అవసరమైన అన్ని శాఖల మధ్య ఇప్పటికే సమన్వయం సాధించాం.
భాస్కర న్యూస్ : కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేస్తామని అన్నారు… దాని యాక్షన్ ప్లాన్ ఏంటి…?
డీవైసీయం భట్టి విక్రమార్క : మా ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చిన వెంటనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశాం. ఇక మహిళలను ఎంటర్‌ప్రెన్యూయర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం మా ప్రభుత్వం పెట్టుకుంది. స్వయం సహాయక బృందాల ద్వారా, చిన్న తరహా, సూక్ష్మ వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబనను, సాధికారతను సాధించేలా ప్రోత్సహించడం మా ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం. మహిళలు స్వయం సహాయక బృందాల ద్వారా ధాన్యం సేకరణ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో మిల్లింగ్ చేపట్టేలా, పెట్రోల్ పంపులు వారే టేకప్ చేసి నిర్వహించేలా, ప్రభుత్వ భవనాల నిర్వహణ కాంట్రాక్టులను కేటాయించనున్నాం. కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కులలో 5 శాతం స్థలాన్ని మహిళలకు కేటాయించాలని నిర్ణయించాం.
భాస్కర న్యూస్ : నిరుద్యోగులు, యువతకు ఏం చేస్తున్నారు…?
డీవైసీయం భట్టి విక్రమార్క : ఈసారి సరికొత్త పథకం ద్వారా యువత వాణిజ్య రంగంలో రాణించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం. బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించినం. అర్హత, ఆసక్తి ఉన్న యువతకు రూ.4 లక్షలు పెట్టుబడి సాయంగా అందించి ఏదైనా సంస్థలు నెలకొల్పేందుకు సాయం అందిస్తాం. కొత్తగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడల్లో 15 శాతం ఎస్సీ/ఎస్టీ వ్యాపార వేత్తలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాం.
భాస్కర న్యూస్ : మీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు పెట్టుబడులు ఎన్ని వచ్చాయి…?
డీవైసీయం భట్టి విక్రమార్క : సరికొత్త వృద్ధి పథంలో తెలంగాణను తీసుకెళ్లాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. సీఎం రేవంత్ సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుల బృందం దావోస్‌లో గ్రీన్ఎనర్జీ, రక్షణ, డాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర అనేక రంగాల్లో రూ.1.78లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు. అంతకు ముందు సంవత్సరం దాదాపు 47 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్న కంపెనీల ప్రతినిధులు అందరూ హైదరాబాద్ విజిట్ చేసి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. వచ్చిన కంపెనీలు అన్నీ తెలంగాణ ప్రభుత్వ విధానాలను మెచ్చుకుంటున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సుకత చూపిస్తున్నాయి. మా ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకు ప్రపంచ స్ధాయి కంపెనీలన్నింటికీ తెలంగాణ ప్రత్యామ్నాయ గమ్యం అవుతుంది. ఈ విధానంలో స్వదేశీ కంపెనీలు మరింత బలపడతాయి.
భాస్కర న్యూస్ : మీరు వచ్చాక సింగరేణిలో కొత్త అధ్యాయం మొదలైందన్న వాదన వినిపిస్తోంది. అదెలాగో చెప్తారా?
డీవైసీయం భట్టి విక్రమార్క : మేము అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలకు జవసత్వాలు తీసుకొచ్చాం. తెలంగాణ ఎల్లలు దాటి సింగరేణి ప్రగతిని విస్తరింప జేస్తున్నాం. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్‌ను వేలంలో కొనుగోలు చేశా. ఇక, సింగరేణి అంటే ఇప్పటిదాకా బొగ్గు ఉత్పత్తి సంస్థ అనే ముద్ర ఉంది. కానీ, ఇటీవలే రాజస్థాన్ వెళ్లి సింగరేణి సంస్థ తరపున ఎంఓయూ కుదుర్చుకున్నాం. ఇప్పటికే సింగరేణిసంస్థ 1,200 మెగావాట్లు థర్మల్ విద్యుత్, 245.5 మెగా వాట్లు సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వీటికి తోడు రాజస్థాన్‌లో 3,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒప్పందం చేసుకున్నాం. అక్కడ.. 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నాం. వచ్చే ఐదేళ్లలో 7,650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దబోతున్నాం. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో బివోటీ (బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) విధానంలో రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా ఎంఓయూ కుదుర్చుకొని వచ్చాం.
భాస్కర న్యూస్ : విద్యుత్ విషయంలో మీరు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారన్న ప్రశంసలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు?
డీవైసీయం భట్టి విక్రమార్క : అవును.. నేను రాష్ట్రంలో ప్రణాళిక శాఖ, ఆర్థిక శాఖతో పాటు.. ఇంధన శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నా. నిత్య జీవితంలో విద్యుత్ అనేది అత్యవసరం. సాధారణ గృహాల నుంచి మొదలుకుంటే ఆధునిక భవనాల వరకు, చిన్న కుటీర పరిశ్రమ నుంచి భారీ పరిశ్రమల దాకా విద్యుత్‌తోనే ప్రతీదీ నడుస్తుంది. కాబట్టి విద్యుత్‌కు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను, భవిష్యత్తులో పెరగబోయే డిమాండ్‌ను కూడా అంచనా వేస్తూ ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నాం. లోటు ఏర్పడ్డాక పక్క చూపులు చూసేకన్నా.. దానిని ముందుగానే గ్రహించి అధిగమించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ దిశలోనే ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025’ని ఆవిష్కరించాం.