తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ చైర్మన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.వి.శ్రీనివాస్ రావు అన్నారు. చంచల్ గూడ సికా హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో పాటు.. జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ రూపొందించిన ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) పరికరాలను రాష్ట్రంలోని అన్ని జైళ్ల అధికారులకు పంపిణీ చేశారు. జైళ్ల శాఖ ఆధునికీకరణ పథకంలో భాగంగా ఈ అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం తయారు చేయించింది.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ హై టెక్నాలజీ ఐసీజేఎస్ పరికరాల ద్వారా
క్రిమినల్ జస్టిస్ లోని ప్రధాన స్తంభాలైన పోలీస్, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాసిక్యూషన్ లను ఏకీకృతం చేయడం సాధ్యమవుతుందన్నారు. ఫలితంగా న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించ వచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ రాజేష్, జైళ్ల శాఖ డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్, రాష్ట్రంలోని ఇతర జైళ్ల సూపరింటెండెంట్లు రామచందర్, లక్ష్మి శ్రీనాథ్, సికా ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.