-
నగరంలో సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం
-
సంప్రదాయ రీతిలో స్వాగతం పలికిన అధికార గణం
జపాన్‌లో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నగర మేయర్ కజుహిసా టకేచీ తెలంగాణ ప్రతినిధులను జపనీస్ సాంప్రదాయ రీతిలో ఎంతో ఘనంగా, ఆతిథ్య సత్కారాలతో స్వాగతం పలికారు.
ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మరియు రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు. కితాక్యూషూ నగరం ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో బాధపడిన నగరంగా పేరుగాంచింది. గాలి, నీరు, నేల పూర్తిగా విషపూరితంగా మారిపోయిన దుస్థితి అక్కడ చోటు చేసుకుంది. అయితే, అక్కడి ప్రజలు, అధికారులు మిళితంగా పర్యావరణ పరిరక్షణ పై తీసుకున్న చర్యల వల్ల ఈ నగరం ఇప్పుడు ప్రపంచానికి ఒక ఉత్తమ పర్యావరణ నగరంగా మారింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మూసీ నది ప్రక్షాళన ఎంత కీలకమో వివరించారు. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ‘జపాన్ తెలుగు సమాఖ్య’ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, వారణాసిలో గంగా ప్రాజెక్ట్, ఢిల్లీ యమునా రివర్ ఫ్రంట్ ల ఆధారంగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ఇందులో భాగంగా చెరువుల మధ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలు గురించి ప్రస్తావిస్తూ వాటిని కూల్చకపోతే ప్రకృతి క్షమించదని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను స్వయంగా అమెరికాలో హడ్సన్ నది, లండన్‌లో థేమ్స్ నది, సియోల్‌లోని నదులను సందర్శించిన అనుభవాన్ని పంచుకుంటూ, హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలంటే, ముందు మూసీ నదిని కాలుష్యరహితంగా మారుస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు.
అదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో, లండన్ వంటి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలంటే, ప్రవాస తెలుగువాళ్ల సహకారం, ఆలోచనలు ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్న అభిమానం, తమ సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన అపూర్వమైనదని అన్నారు.