తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3వ తేదీన కేబినెట్ విస్తరణ జరుగుతుందని అందరూ ఆశించినప్పటికీ, చివరి నిమిషంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఊహించని పొలిటికల్ అప్డేట్స్ కారణంగా ఈ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. ముఖ్య నేతలు మంత్రుల జాబితా ఖరారైనట్లు భావించినప్పటికీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మారిపోయింది.
రాహుల్ గాంధీ అభ్యంతరాలు :
రాష్ట్ర కేబినెట్లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, సామాజిక, ప్రాంతీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని నలుగురిని ఎంపిక చేసేందుకు గత నెల ఢిల్లీలో నిర్ణయం తీసుకున్నారు. ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంలో కూడా విస్తరణపై సంకేతాలు ఇచ్చారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారట. అయితే, రాజగోపాల్‌కు పార్టీలో చేరినప్పుడే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని నేతలు వివరించినప్పటికీ, తుది నిర్ణయం కోసం వేచి చూడాలని రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.
సీనియర్ల వ్యూహాలు, లేఖలు :
ఇదిలా ఉండగా, సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్‌కు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం అన్యాయం అని, ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు, సామాజికవర్గాల ఆధారంగా పలువురు నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి, వివేక్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరిగినప్పటికీ, రాహుల్ అభ్యంతరంతో జాబితాలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
పై పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ నెలకొంది. సీనియారిటీ, సామాజిక సమీకరణం, జిల్లాల ప్రాతినిథ్యం వంటి అంశాలు తెరపైకి రావడంతో విస్తరణ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.