34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

అమిత్ షా వ్యాఖ్యలతో గంగవెర్రులెత్తుతున్న తమ్ముళ్ళు

  • గత చంద్రబాబు పాలనపై ఆయన సమక్షంలోనే అమిత్ షా విమర్శలు
  • 2014-19 వరకు ఏపీలో మానవ నిర్మిత విధ్వంస పాలనంటూ వ్యాఖ్య
  • షా వ్యాఖ్యలను అనువాదంలో సవరించిన పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటోంది. కూటమిలో ఎవరి సీటు కింద ఎవరు మంట పెడుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, తెలిసినా ఏం చేయలేని స్థితి కొనసాగుతోంది. దీంతో అందరికీ మండిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పటికే సీఎం కుర్చీపై కూటమి పార్టీల క్షేత్రస్ధాయి కార్యకర్తల్లో అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. ఆండ్రాయిడ్‌ సెల్‌ ఫోన్‌ చేతిలో ఉంది కదా అని ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు… వారివారి అభిప్రాయాలను సెల్ఫీ విడియోలు తీసేసుకుని సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేసేస్తున్నారు. ఈ పరిణామం కూటమి పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కూటమిలో భాగస్వామ్య పార్టీ నేతలైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా ఎంపీ పురంధేశ్వరి ఇలా అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అమిత్ షా హిందీలో ప్రసంగం చేస్తుంటే, దానిని తెలుగులో పురంధేశ్వరి అనువదించారు. అయితే అమిత్ షా ఏమన్నారంటే..

‘అపార సహజ వనరులు అత్యధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు మానవ నిర్మిత విధ్వంసం జరిగిందని మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం కారణంగా ఐదేళ్లు ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని… అభివృద్ధి పూర్తిగా అడుగంటింది అని పేర్కొన్నారు. ఇది చంద్రబాబు గత ప్రభుత్వ కాలాన్ని సూచిస్తూ చేసిన వ్యాఖ్యగా ప్రస్పుటమవుతోంది. అయితే దీనిని తెలుగులో అనువాదం చేసిన ఎంపీ పురంధేశ్వరి ఏం చేశారంటే,  అమిత్ షా అన్న 2014-2019 సంవత్సరాలను మార్చి, తెలివిగా, సమయస్ఫూర్తిగా 2019-2024 అని చదివారు. ఇప్పుడిది నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఆయనా మాటంటే, ఈవిడ ఈ మాట ఎందుకు మార్చింది? అని నెటిజన్లు  పట్టుకున్నారు. ఇక్కడ రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌ షా పొరపాటుగా 2019-24 బదులు 2014-19 అని తన స్పీచ్‌లో కోట్‌ చేశారని దాన్ని పురంధేశ్వరి సరిచేయడంలో తప్పు ఏముందని కూటమి మద్దతు దారులు అంటుండగా… రాసుకు వచ్చిన స్పీచ్‌ అమిత్‌ షా చదివారని, పైగా అదే స్పీచ్‌ని యధాతథంగా పీటీఐ వార్తా సంస్ధ మీడియాకు విడుదల చేసింది కాబట్టి ఇదేదో పొరపాటున జరిగిందని భావించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పుడిది నెట్టింట మరో టర్న్ తీసుకుంది. అదేమిటంటే తెలుగుదేశం అనుకూల మీడియా ఏం చేస్తోందంటే, హోంమంత్రి ప్రసంగాలను మార్చి మార్చి రకరకాలుగా రాస్తూ… ప్రతి వార్తలో 2019-2024 అన్నాడని వండి వార్చేస్తున్నారు. ప్రతి వార్తను అక్కడికే తీసుకెళ్లి, బోడిగుండుకి మోకాలికి ముడివేసేస్తున్నారు. అప్పుడే అన్నాడని జనం నెత్తిన బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వైసీపీ వర్గాలు తక్కువ తిన్నాయా? వాళ్లు కూడా ఆధారాలు వెతికేస్తున్నారు. వారికి బలమైన తీగ దొరికింది. అదేమిటంటే, అమిత్ షా పొరపాటున అనలేదు, కావాలనే అన్నారనే సత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం…ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో (పీసీబీ) విడుదల చేసిన నోట్ ని విడుదల చేస్తున్నారు.

అందులో…2014-2019 వరకు మానవ తప్పిదాల వల్ల జరిగిన విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది…అని  రాశారు. అలాగే దేశ, విదేశాల్లోని అన్ని మీడియా పత్రిక, టీవీ సంస్థలకు అదే కాపీని పంపించారు. దీంతో కూటమి నేతలు తలలు పట్టుకున్నారు. ఆయనలా అంటే, పురంధేశ్వరి ఇలా ఎందుకన్నారని ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు పెడుతున్నారు. విశ్లేషణలు చేస్తున్నారు.

మరోవైపు అమిత్ షా మాటలని కూడా తక్కువ చేసి చూడలేమని అంటున్నారు. దీనివెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అంటున్నారు. చంద్రబాబుని ఎప్పటికి వారు నమ్మరనే ప్రచారం సాగుతోంది. వారికి జగన్ మీద ఉన్న ప్రేమ చంద్రబాబుపై లేదని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు చేతిలో రెండు దెబ్బలు తిన్న బీజేపీ మూడోసారి అప్రమత్తంగానే ఉందని అమిత్ షా మాటలని బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కూడా లోకేష్ రూపంలో ఝలక్ తినేలాగే కనిపిస్తున్నాడు. అందువల్ల ఎప్పటిలా జనసేన, బీజేపీ కలిసి కూటమిలో సరికొత్త వ్యూహానికి రూపకల్పన చేయడం లేదు కదా…అని కొందరంటున్నారు. మొత్తానికి కూటమి మూడు పార్టీలు మూడు ముక్కలైతే మాత్రం…మళ్లీ వైసీపీకి ఊపిరి పోసినట్టవుతుందని కొందరు నెత్తి కొట్టుకుంటున్నారు. ఇక తెలుగు తమ్ముళ్ళైతే అమిత్ షా వ్యాఖ్యలకు నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com