తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు తాము శాశ్వత పరిష్కారాలు చూపామన్నారు. ముఖ్యంగా సన్నబియ్యం పథకం ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించామని తెలిపారు.
“ఆనాడు రెండు రూపాయల బియ్యం ఉండేది, కానీ ఇప్పటి సన్న బియ్యం పథకం అద్భుతం. ఇది మన బ్రాండ్, మన పేటెంట్,” అని సీఎం స్పష్టం చేశారు. భూ భారతిని రైతులకు అందించాలని, ఇందిరమ్మ ఇండ్లు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ ఇండ్లు క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లులను తీసుకురావడం, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం గంభీరంగా వ్యవహరించిందని చెప్పారు. “వర్గీకరణ పూర్తయ్యే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం,” అని పేర్కొన్నారు.
రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు ప్రతీ గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవుతానన్నారు.
హెచ్‌సీయూ భూముల అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని, దీనిని ప్రధాని మోదీ కూడా నమ్మారని వ్యాఖ్యానించారు. “తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండ, కులగణన మరణశాసనం అవుతుంది,” అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
“మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజల ఆవశ్యకతలపై నివేదికలు సిద్ధం చేసుకోవాలి. వాటిని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది,” అంటూ ఎమ్మెల్యేలపై బాధ్యత మోపారు.