తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో ఈ కీలకపరిణామం చోటు చేసుకుంది. ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే ల, అనర్హతపై విచారణ చేసి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది. నోటీసులకు ఈనెల 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసులకు స్పీకర్ గడ్డం ఏమని సమాధానం చెబుతారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. 2023లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.
నిజానికి ఫిరాయింపుల రాజకీయానికి తెరలేపిందే కేసీఆర్ అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ళల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడిన కేసీఆర్.. ప్రతిపక్షంలోకి రాగానే అవే ఫిరాయింపులకు రేవంత్ పాల్పడటాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటువేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుల్లో కేసులు వేశారు.
మొదట బీఆర్ఎస్ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్ వ్యవస్ధ అధికారాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు స్పష్టంగా తేల్చేసింది. కాకపోతే అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోమని మాత్రం స్పీకర్ కార్యాలయానికి సూచించింది.
హైకోర్టులో తాము ఆశించినట్లుగా తీర్పురాకపోవటంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యంచేసుకుని శాసన వ్యవస్ధ అధికారాల్లోకి జొరబడేందుకు హైకోర్టు నిరాకరించింది. అందుకనే కేటీఆర్ తాను సుప్రీంకోర్టులో కేసు వేయటమే కాకుండా పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ తో కూడా కేసులు దాఖలుచేయించారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దాఖలు చేసిన కేసులపై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది. విచారణలో భాగంగానే బుధవారం స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మరి నోటీసులకు స్పీకర్ ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.
సుప్రీంకోర్టు నోటీసుల జారీ నేపథ్యంలో స్పీకర్ ఏం చేస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాల సమాచారం ప్రకారం స్పీకర్ అధికారాల్లో న్యాయవ్యవస్ధ జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదు. ఎంఎల్ఏల అనర్హతపై ఫలానా సమయంలోగా లేదా ఇంత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ రూల్ బుక్‌లో కూఆ ఎక్కడా లేదు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం పార్టీలకు, ఎమ్మెల్యేలకే కాదు.. చివరకు కోర్టులకు కూడా లేవు. అయితే, ఏ విషయంలో అయినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఛాలెంజ్ చేస్తు ఎవరైనా కేసు వేస్తే దాన్ని సమీక్షించే అధికారాలు కోర్టులకు ఉన్నాయి. ఇదే విషయం లోక్ సభ స్పీకర్‌గా పనిచేసిన సోమ్‌నాధ్ చటర్జీ హయంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఫిరాయింపు ఎంపీల విషయంలో చటర్జీ తొందరగా నిర్ణయం తీసుకోవటం లేదని కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ ఆధారంగా లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతో సమావేశం నిర్వహించారు.
పార్లమెంటు, అసెంబ్లీల స్పీకర్ల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదని సమావేశంలో తీర్మానించారు. అదే తీర్మానాన్ని చటర్జీ రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఫిరాయింపు ఎంపీల అనర్హత వేటువిషయంలో కోర్టులో విచారణ జరగలేదు. ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే 2014-19 మధ్య చంద్రబాబునాయుడు 2014-2023 మధ్య కేసీఆర్ యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ వేసిన కేసుల విషయంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించని విషయాన్ని సెక్రటేరియట్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
గతంలో స్పందించని కోర్టులు.. ఇఫుడు స్పందించ కూడదని ఏమీలేదు. కాకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడుప్రశ్న. సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసులపై స్పీకర్ స్పందించక పోయినా, లేదా శాసనవ్యవస్ధ అధికారాల్లోకి న్యాయవ్యవస్ధ జొరబడకూడదనే విషయాన్ని గుర్తు చేస్తూ నోటీసులకు సమాధానం ఇచ్చినా సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఇటు సుప్రీంకోర్టు అటు స్పీకర్ గనుక అధికారాల పరిధి విషయంలో గట్టిగా నిలబడితే రెండు వ్యవస్ధల మధ్య ఘర్షణ తప్పదనే అనిపిస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తాము వేసిన పిటీషన్ల విషయంలో కోర్టులో ఎందుకు ఇంత సీరియస్‌గా స్పందించలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎట్టి పరిస్ధితుల్లోను అనర్హత వేటు పడదని రేవంత్ గట్టిగానే చెబుతున్నారు ఈ నేపథ్యంలో నోటీసులకు స్పీకర్ స్పందన ఏమిటో చూడాలి.