తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం రియాక్ట్ అయ్యింది. ఈ భూములపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అత్యవసరంగా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు.. అత్యవసరంగా ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలలోపే నివేదిక ఇవ్వాలని ఆ ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.
మరోవైపు.. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపైనా అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణకు ఎలాంటి ఆటంకం లేకుండా.. ఆ విచారణపై స్టే ఇవ్వడం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆ ప్రాంతంలో చెట్లు నరకడం నిలిపేయాలని, తెలంగాణ సీఎస్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.