23.4 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

గవర్నర్‌లకు షాక్‌ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

  • సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

  • కొందరు గవర్నర్‌లకు బిగ్‌ షాక్‌

  • రాష్ట్రాలకు సహకరించాల్సిందే అని స్పష్టం

  • ఆర్టికల్‌ 200 ప్రస్తావించిన న్యాయస్థానం

  • బిల్లులపై రాష్ట్రపతి ౩ నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

    దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా తరచూ బయటపడుతోన్న వివాదాలకు సుప్రీం కోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వం అనే రీతిలో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు గందర గోళానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన 415 పేజీల తీర్పు ఈ సందిగ్ధానికి తెర దించింది.

సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ఒక రకంగా కొందరు గవర్నర్‌లకు తీవ్ర షాకింగ్ అంశం కాగా.. గవర్నర్లతో ఇబ్బందులు పడుతున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం బిగ్‌ రిలీఫ్‌ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాల విజయంగా అభివర్ణించవచ్చు.

వాస్తవానికి తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించినప్పటికీ.. తీర్పు మాత్రం ఒక్క తమిళనాడుకే పరిమితం చేయలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌ల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం కుండ బద్దలు కొట్టింది.

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదం తెలపడం లేదనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం అర్ధరాత్రి 415 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో గవర్నర్‌ తన దగ్గరే పెండింగ్‌లో పెట్టుకున్న 10 బిల్లులు గవర్నర్ ఆమోదించినట్లే అని న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.

గవర్నర్ పదవిని తక్కువచేయడాన్ని తాము కోరుకోవడం లేదన్న సుప్రీం కోర్టు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య నియమాలను గౌరవిస్తూ, ప్రజల నిధివల్ల ఏర్పడిన ప్రభుత్వం, శాసనసభ భావజాలాన్ని గౌరవిస్తూ గవర్నర్ పనిచేయాలని సూచించింది. రాజకీయ ప్రోద్భలంతో కాకుండా రాజ్యాంగ ప్రమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక గవర్నర్‌.. ఆ రాష్ట్రానికి మిత్రుడు, తత్వవేత్త, మార్గదర్శిగా పని చేయాలని న్యాయమూర్తులు జె.బి. పరిడివాలా, ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

అవగాహనతో పరిష్కారం చూపించాలే తప్ప, పరిపాలనా వ్యవస్థను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదన్న న్యాయస్థానం.. గవర్నర్‌ చర్యలు గౌరవనీయమైన రాజ్యాంగ పదవికి తగినట్లు ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్ర శాసనసభ మళ్లీ ఆమోదించిన తర్వాత 2023 నవంబర్ 18న గవర్నర్‌కు పంపిన తేదీనే ఆ 10 బిల్లులు ఆమోదించినట్లుగా ప్రకటించడం తప్ప తమకు ప్రత్యామ్నామయం కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగ పదవులు చేపట్టిన వారు, తాము తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విలువలను పాటించాలని, ప్రజలు ఎంతో త్యాగాల తర్వాత సాధించిన రాజ్యాంగాన్ని తక్కువ చేయకూడదని, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు లొంగకుండా రాజ్యాంగ స్ఫూర్తిని పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది.

తమిళనాడు గవర్నర్ డాక్టర్‌ రవి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను తాను నిలిపివేసిన తీరు సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తే, దేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది.

ఇక, సంవిధాన సభలో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చివరి ప్రసంగాన్ని కూడా న్యాయస్థానం ఉదహరిస్తూ ‘‘ఎంత మంచి రాజ్యాంగమైనా, దాన్ని అమలు చేసే వారు చెడిపోతే దానిపైనా ప్రభావం చూపుతుంది. అదే విధంగా, ఎంత చెడు రాజ్యాంగమైనా మంచి వ్యక్తులు అమలు చేస్తే అది మంచి ఫలితాలిస్తుంది’’ అని అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి చెడుపద్ధతులను గుర్తించి, వాటిని తొలగించే దిశగా మరింత బలంగా ముందుకు సాగడం మన బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగమే దేశ ఆత్మ అని, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సార్వభౌమత్వాన్ని సృష్టించిన దూరదృష్టిగల నాయకుల సృష్టి అని, రాజ్యాంగమే మన రక్షణకు, భద్రతకు మూలాధారమని, ఇది విలువలతో పాటు మన బాధ్యతలకూ గమ్యం చూపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 75 ఏళ్లయినా మనం దానినే నమ్ముకుంటున్నామని, ఎందుకంటే అది మన హక్కులను కాపాడుతోందని, సమాజ హితమే దాని ప్రథమ లక్ష్యమని, కాబట్టి రాజ్యాంగం పవిత్రతను కాపాడుకోవడం మన ప్రథమ బాధ్యత అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

అయితే, సుప్రీంకోర్టు తన తీర్పులో ఆర్టికల్‌ 200ను ప్రస్తావించింది. గవర్నర్ అధికారాల పరిధిని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ కేసులో సుప్రీంకోర్టు సూచించింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఏం చేయాలో? ఎలా వ్యవహరించాలో? తీర్పులో ప్రస్తావించింది. ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే వర్తించదని.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య సంబంధాలు రాజ్యాంగాన్ని పరిరక్షించడం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అనుసంధానంగా పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది.

మరోవైపు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభివర్ణించారు. తమ న్యాయపోరాటం.. దేశానికే వెలుగు చూపిందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com