- సూర్యుడి అతినీలలోహిత కిరణాల రేడియేషన్
- అధిక రేడియేషన్ బారిన పడిన సునీత, విల్మోర్
- 9 నెలలలో ఆ రేడియేషన్ 270 ఛెస్ట్ ఎక్స్ రేలకు సమానం
- శరీరంలో జీన్స్ పూర్తిగా ధ్వంసం అయ్యే ఛాన్స్
- గుండ్రంగా మారనున్న గుండె ఆకృతి
- మెదడులో ద్రవాలు నిల్వవల్ల బ్రెయిన్ ఎడిమా
- మెదడు వాపు, చెముడు, దృష్టి లోపం కలిగే ఆస్కారం
అంతరిక్షంలో సుదీర్ఘ సమయం ఉండిపోవడం వల్ల భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తీవ్రమైన రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటు న్నారు. అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్లకు సూర్యుడి నుంచి వచ్చే అతి వేడి కిరణాల వల్ల రేడియేషన్ చాలా ఎక్కువ మోతాదులో తగులుతుంటుంది. దీర్ఘకాలం పాటు అంత మొత్తంలో రేడియేషన్ భరించడం వల్ల హై రిస్క్ జోన్ లో వీరు ఉన్నట్లే లెక్క. కేన్సర్ ముప్పు కమ్మేయడమే కాదు, కండరాల క్షీణత చాలా వేగంగా జరిగిపోతుంది.కేంద్ర నాడీ వ్యవస్థ అస్తవ్యస్థమవుతుంది. 9నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీత దాదాపు 270 చెస్ట్ ఎక్స్ రేలు తీస్తే ఎంత రేడియేషన్ తగులుతుందో అంత రేడియేషన్ ను ఎదుర్కొన్నారు. దీనికి తోడు ఎముకలు సాంద్రత తగ్గి గుల్లబారి ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆస్టియో పోరోసిస్ కు దారి తీస్తాయి. రికవర్ కావడం చాలా కష్ట సాధ్యం. 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం అంతరిక్షంలో గడిపి తిరిగి భూమికి వచ్చాక చాలా మందిలో జీన్స్ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొంతమందిలో అవి పూర్తిగా ధ్వంసమై ఇక తిరిగి సాధారణ స్థితికి వచ్చే ఆస్కారం లేదు. కనీసం ఏడుశాతం మందికి అలా అవుతుందని ట్విన్స్ అనేసంస్థ అధ్యయనంలో తేలింది.
అంతరిక్షంలో ఉన్న వారి జీవ గడియారం మారిపోతుంది. శరీరంలో రిథమ్ లోపిస్తుంది. హృదయ స్పందనలు అసాధారణంగా ఉంటాయి.మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్, కుంగుబాటు,ఆందోళన, ఆతృత, మతిమరుపు కమ్మేస్తాయి. ఈ మానసిక స్థితిని జయించి సాధారణ స్థితికి రావడం కత్తిమీద సామే. శరీరం కోల్పోయిన దట్టమైన కణజాలాన్ని తిరిగి నిర్మించుకోవాలంటే వ్యాయామం ఒక్కటే మార్గం.
బ్రెయిన్ ఎడిమా వచ్చే ఛాన్స్…
అంతరిక్షంలో శరీరంలో ద్రవాలన్నీ పైకి ప్రవహిస్తుంటాయి. కారణం భ్యూమ్యాకర్షణ శక్తి ఉండదు కాబట్టి. అలా పైకి ప్రవహించే ద్రవాలు కొన్ని మెదడులో నిలిచిపోతాయి. ఆస్ట్రోనాట్లు భూమిపైకి వస్తున్నప్పుడు ఆ ద్రవాలన్నీ భూమ్యాకర్షణ వల్ల కిందకు లాగబడతాయి. కానీ అవి కిందకు ప్రయాణించే వ్యవస్థ ఇంకా పూర్తిగా అలవాటు పడదు. ఆ కారణంగా సెరిబ్రెల్ ఎడిమా అంటే మెదడు వాపు, చెవుడు, దృష్టి లోపాలు ఏర్పడతాయి. మెదడులో ఈ ఒత్తిడిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులార్ సిండ్రోమ్ అని పిలుస్తారు.
గుండెలో మార్పు
ఆస్ట్రోనాట్ల గుండె ఆకృతిలో సైతం మార్పులు వస్తాయి. మామూలుగా ఓవల్ షేప్ లో ఉండే గుండె అక్కడ గుండ్రంగా మారిపోతుంది.కండరాలు వాచి, రక్తనాళాలపై ఒత్తిడి పడి అవి ముడుచుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది.