ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయం ఇవాల్టి నుంచే అంటే మే రెండో తేదీ నుండి అమలులోకి వచ్చింది. తల్లిదండ్రులు, అంగన్‌వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆదేశాలతో అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అమీర్‌పేటలోని వెంగళరావు నగర్‌లో ఉన్న కమిషనరేట్ కార్యాలయంలో డైరెక్టర్ కాంతి వెస్లీ అంగన్‌వాడీ యూనియన్ నేతలతో సమావేశమై సెలవులపై చర్చించారు. అనంతరం సెలవుల ప్రకటన చేశారు.
అయితే, సెలవుల కాలంలోనూ అంగన్‌వాడీ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహార సరఫరా కొనసాగుతుంది. గుడ్లు, ఇతర సరుకులు మినహాయింపు లేకుండా అందజేస్తామని డైరెక్టర్ పేర్కొన్నారు. మరోవైపు.. అంగన్‌వాడీ టీచర్లు సెలవుల సమయంలో ఇంటింటికి వెళ్లి, ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించారు. ఇది అంగన్‌వాడీలకు మరింత చేరువ కాబడే ప్రయత్నంగా నిలుస్తుందని తెలిపారు.వేసవి సెలవుల ప్రకటనపై అంగన్‌వాడీ యూనియన్ నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.