తెలంగాణలో కొంత కాలంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తెల్లవారు జాము నుంచి ఉదయం పూట చలిగా ఉంటోంది. పది గంటలు కాగానే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇటు.. చలి.. రెండు మూడు గంటల్లోనే విపరీత మైన ఎండ వేడి జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రానున్న మూడు రోజుల్లొ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల కూడా సమీపిస్తుండటంతో.. ఇక ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని హెచ్చరిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇప్పుడే ప్రజలు ఉదయం ఎనిమిది గంటలు దాటితే బయటకు రావడానికి భయపడిపోతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గడం లేదు. తెలంగాణలో రొటీన్‌కు భిన్నంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ యేడాది వేసవిలో ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.